/rtv/media/media_files/2025/09/25/anantapur-crime-news-2025-09-25-20-39-39.jpg)
Anantapur Crime News
అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో వేడి పాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి అక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కృష్ణవేణి అనే మహిళ తన మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి విధులు నిర్వహిస్తోంది. చిన్నారి అక్షిత ఆడుకుంటూ వంట గదిలోకి వెళ్లింది.
వేడి పాల గిన్నెలో పడి చిన్నారి మృతి:
ఆ సమయంలో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వేడి పాలను చల్లబరచడానికి వంటగదిలో ఫ్యాన్ కింద గిన్నెలో పెట్టారు. ఆడుకుంటూ వెళ్లిన అక్షిత ప్రమాదవశాత్తు ఆ వేడి పాల గిన్నెలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి అరుపులు విన్న తల్లి వెంటనే అక్కడికి చేరుకుని బయటకు తీసింది. వెంటనే చిన్నారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి అక్షిత ఈ రోజు మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్రగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్ అరెస్టు
ఈ విషయం తెలుసుకున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలను డీసీవో జయలక్ష్మి పరిశీలించారు. ఈ ఘటన పాఠశాల నిర్వహణలో భద్రతా లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఈ విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!