2026 Budget: 26 ఏళ్ళ తర్వాత చరిత్ర పునరావృతం..ఆదివారం రోజున బడ్జెట్..స్టాక్ మార్కెట్లు ఓపెన్

ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో అరుదైన సంఘటన జరగబోతోంది. 26 ఏళ్ళ తర్వాత  చరిత్ర పునరావృతం అవబోతోంది. ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు స్టాక్ మార్కెట్ కూడా తెరిచి ఉండనున్నాయి. 

New Update
budget 26

దేశ ఆర్థిక ఆర్ధిక చరిత్రలో కీలక అధ్యాయం నమోదు కాబోతుంది. దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా 2026 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా అరుదైన సంఘటన. వివరంగా చెప్పాలంటే దేశ చరిత్రలో 26 ఏళ్ళ తర్వాత ఇది పునరావృతం అవుతోంది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశవంత్ సిన్హా ఆదివారం రోజునే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సాధారణంగా సెలవు రోజున బడ్జెట్ తేదీ వస్తే, దాన్ని ముందురోజుకు లేదా తర్వాతి రోజుకు మార్చే ఆనవాయితీ ఉంది. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు.

దీంతో పాటూ ఆమె ఖాతాలో మరో రికార్డ్ చేరనుంది. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. వరుసగా తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించనున్నారు. దీని ద్వారా మోరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, పీ. చిదంబరం వంటి ప్రముఖుల రికార్డులను నిర్మలా సీతారామన్ అధిగమించనున్నారు.  ఇక బడ్జెట్ కు సంబంధించి జనవరి 29న ఆర్థిక సర్వే విడుదల కానుండగా, దాని ఆధారంగానే బడ్జెట్‌లో కీలక విధానాలు, కేటాయింపులు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లు కూడా..

ఆదివారం కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.  సాధారణంగా ఆదివారాల్లో మూసి ఉండే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ఈసారి ఫిబ్రవరి 1న ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీనికి సంబంధించి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు విడివిడిగా సర్క్యులర్లు విడుదల చేశాయి. బడ్జెట్ రోజున మార్కెట్ కార్యకలాపాలు పూర్తిగా లైవ్‌లో కొనసాగుతాయని.. సాధారణ ట్రేడింగ్ డే మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు కొనుగోలు-విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు ఎలాంటి పరిమితులు ఉండవని చెప్పాయి. బడ్జెట్ ప్రకటన స్టాక్ మార్కెట్ల ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందులో వచ్చే ప్రకటనల ప్రభావం తక్షణమే షేర్ ధరల్లో ప్రతిబింబిస్తుందని అంటున్నారు. పన్నుల విధానం, మౌలిక వసతులు, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన ప్రకటనలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయని..దీంతో ఇన్వెస్టర్లు బడ్జెట్ పై ఫోకస్ చేశారని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి, ఈసారి బడ్జెట్ డే కేవలం రాజకీయంగా కాదు.. ఆర్థికంగా కూడా అత్యంత కీలకంగా మారనుంది.

Also Read: Elon Musk: బోర్డ్ ఆఫ్ పీస్ కాదు జస్ట్ పీస్..గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు

Advertisment
తాజా కథనాలు