/rtv/media/media_files/2025/06/02/9vExCZVtKyVCFEQe1woe.jpg)
Differences in opinion among Maoists
Maoists : దండకారణ్య మావోయిస్టు పార్టీ లో చీలిక వచ్చిందా? సాయుధ పోరాటమే మార్గమని ఒకరు..ఆయుధాలు వదిలేయడమే మంచిదని మరొకరు వాదిస్తున్న సమయంలో మావోయిస్టుల్లో చీలిక తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.విప్లవోద్యమంలో ముందుకు సాగాలా? ఆయుధాలు వదిలేయాలా? అన్న విషయంపై మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయుధ విరమణ అంశంపై కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మాత్రమే తన వైఖరిని వ్యక్తం చేశారు. అయితే తాజాగా నార్త్ బస్తర్, గడ్చిరోలి ప్రాంత కమిటీలు కూడా అభయ్ అభిప్రాయానికి అనుగుణంగా విడుదల చేసిన ప్రకటనలు మావోయిస్టు పార్టీ నాయకత్వంలో నెలకొన్న అభిప్రాయ బేధాలను తేటతెల్లం చేస్తున్నాయి.
అభయ్, జగన్ ల భిన్నాభిప్రాయం
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 30 నాటికి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ “కగార్”తో దండకారణ్య జోన్ లో విరుచుకుపడుతోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్ కౌంటర్లు కేంద్ర కమిటీ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. సుధీర్ఘ కాలంగా అజ్ఞాతంలో ఉన్న ముఖ్య నాయకులు మరణిస్తున్నారు. అందులోనూ కేంద్ర కమిటీ ప్రధానకార్యదర్శితో పాటు పలువురు కేంద్ర కమటీ నాయకులు మరణించారు. ఈ క్రమంలోనే ఆయుధ విరమణ అంశం గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ కు ముందు కూడా ఈ విషయంపై చర్చ జరిగినట్టుగా అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయుధాల తాత్కాలిక విరమణకే మొగ్గు చూపినట్టుగా ఆయన వెల్లడించారు. అయితే మొదట అభయ్ విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర కమిటీ చర్చ గురించి ప్రస్తావించకుండా తాత్కాలిక ఆయుధ విరమణకు అనుకూలంగా ఉన్నట్టుగా ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మరో లేఖను విడుదల చేస్తూ అభయ్ ప్రకటన ఆయన వ్యక్తిగతమన్నారు. అలా బహిరంగ ప్రకటన చేయడం సరికాదని, అంతర్గతంగా చర్చించాల్సిన విషయాన్ని ఓపెన్ గా చెప్పడాన్ని జగన్ తప్పుబడుతూ లేఖ రాశారు. ఇందుకు స్పందనగా అభయ్ కూడా ఘాటుగానే స్పందించారు. కేంద్ర కమిటీ చర్చతో పాటు పార్టీ డాక్యూమెంట్లను జగన్ చదవాలన్నారు. తాను చేసింది కేంద్ర కమిటీ అభిప్రాయమేనని అభయ్ స్పష్టం చేస్తూ మరో లేఖ విడుదల చేశారు.
అభయ్ కి మద్దతుగా మరో రెండు లేఖలు
ఇదిలా ఉండగానే తాజాగా విడుదల అయిన మరో రెండు లేఖలు సరికొత్త చర్చకు దారి తీశాయి. నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ ప్రతినిధి సుఖ్ దేవ్ కౌడో ఆయుధ విరమణ నిర్ణయాన్ని స్వాగతించారు. సోనూదాదా అలియాస్ అభయ్ కి మద్దతుగా నిలవాలని ఆయన తన లేఖలో కోరారు. నంబళ్ల కేశవరావు చేసిన శాంతి చర్చల ప్రతిపాదనకు రూపేష్ కూడా మద్దతిచ్చారని వెల్లడించారు. నిర్భంధం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో చాలా మంది ఉద్యమాన్ని వదిలి వెల్లిపోతున్న తీరు కూడా ఆందోళన కల్గిస్తోందని గడ్చిరోలి డివిజన్ కమిటీ ప్రతినిధి కలంసాయి వేలడి, 10 కంపెనీ కమాండర్ నిఖిల్, సాంకేతిక విభాగం ఇంఛార్జి మేనులు విడుదల చేసిన మరో ప్రకటనలో వెల్లడించారు. ఆశించిన రీతిలో విప్లవోద్యమం ఉదృతి పెంచుకోలేకపోతున్నామని వారు తమ లేఖలో అభిప్రాయ పడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లో బలహీనపడుతున్న ఈ సమయంలో ఆయుధ విరమణ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ నిర్ణయానికి సానుకూలతను వ్యక్తం చేయాలని కోరడం విశేషం. కొన్ని నెలల వ్యవధిలోనే ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోయామని, 20 మంది వరకు రాష్ట్ర కమిటీ బాధ్యులను కూడా కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలిక ఆయుధ విరమణకు సుముఖంగా ఉన్నామని వారు ప్రకటించడం గమనార్హం.
పార్టీలో చీలిక?
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటనకు అనుగుణంగా ఉత్తర బస్తర్, గడ్చిరోలి డివిజన్ కమిటీలు కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఉద్యమం ఎటువైపు వెలుతుందన్నదే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలు అభయ్, ఆశన్నతో పాటు భారీ ఎత్తున పార్టీ ముఖ్య నాయకులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది.అయితే తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జగన్ తో పాటు బడే దామోదర్, కంకణాల రాజిరెడ్డి అలీయాస్ వెంకటేష్ వంటి నాయకులు మాత్రం సాయుధ పోరుతోనే ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం సాగుంతోంది. ఈ నేఫథ్యంలో కేంద్ర కమిటీలో అత్యంత సీనియర్ నాయకులు అయిన అభయ్, ఆశన్నల నేతృత్వంలో పార్టీ ముఖ్యనేతలు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారా లేక తమ పంథా మార్చుకుని వేరు కుంపటి పెడతారా అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఒకవేళ అభయ్ బయటకు వస్తే పార్టీలో చీలిక తప్పదన్న ప్రచారం సాగుతోంది.
జనజీవన స్రవంతిలోకి ముఖ్యనేతలు
చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్య అటవీ ప్రాంతంలో తాజాగా నెలకొన్న పరిణామాలు మావోయిస్టు పార్టీలో చీలిక మొదలైందన్న చర్చ సాగుతోంది. దండకారణ్య అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా క్రాంతి కారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ నిర్భంధం ఎక్కువవడంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో పార్టీ కీలక నాయకుల్లో కూడా అభిప్రాయబేధాలు పొడసూపడం విప్లవోద్యమంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ప్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు కూడా ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారన్న వార్తను పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read : Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగో పరుగు