/rtv/media/media_files/2026/01/19/silver-2026-01-19-18-22-53.jpg)
Silver Crosses Rs 3 Lakh Mark
Silver Crosses Rs 3 Lakh Mark : దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరుకుని కొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర 100 డాలర్ల మార్కుకు చేరువలో ట్రేడవుతుండటంతో.. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) లో వెండి 1 కిలోకు రూ.3,01,318 పలుకుతుంది. ఒకే రోజులోనే వెండి ధర రూ.10 వేలు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. లోకల్ మార్కెట్లో కూడా Silver ధరలు భారీగా పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర రూ.1,000 పెరిగి రూ.30,500కు చేరుకోగా, 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.3,050 అయింది. 1 గ్రాము వెండి ధర రూ.10 పెరిగి రూ.305కు చేరుకుంది. జనవరి నెలలో వెండి పెట్టుబడిదారులకు అత్యుత్తమ లాభాలను అందించింది. కేవలం 19 రోజుల్లోనే వెండి ధరలు 28 శాతం కంటే ఎక్కువ పెరిగి బంగారాన్ని కూడా మించిపోయింది.
ప్రపంచ రాజకీయ, ఆర్థిక కారణాలు
వెండిధరలు ఘననీయంగా పెరగడానికి ప్రధాన కారణంగా ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాలే అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల ముప్పును తెరపైకి తీసుకురావడంతో, ఈసారి ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలు టార్గెట్ అయ్యాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనను పెంచి, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి ఆస్తుల వైపు పెట్టుబడిదారులను ఆకర్షించింది. అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే సోమవారం స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 94 డాలర్ల వద్ద 4 శాతం కంటే ఎక్కువ పెరిగి కొత్త రికార్డును నమోదు చేసింది. గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు.. యూరోపియన్ దేశాలపై ప్రతిపాదిత సుంకాలు, ప్రతీకార చర్యలపై చర్చలు అన్నీ కలిపి సురక్షిత ఆస్తులపై డిమాండ్‌ను మరింత పెంచాయి. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం.. యూరోపియన్ నాయకులు అమెరికా వస్తువులపై ప్రతిస్పందన చర్యలను పరిశీలిస్తున్నారు.
అంతర్జాతీయంగా వెండికి నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్దఎత్తున పెట్టుబడుల ప్రవాహం పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదలాడుతోన్న అమెరికా డాలర్.. ఇలా ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి – వృద్ధి మందగించటం తదితర కారణాలవల్ల కూడా ఇన్వెస్టర్లు వెండి, బంగారంపై పెట్టుబుడులు సురక్షితమని భావిస్తున్నారు.
నిపుణుల సలహాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2026లోకి అడుగుపెడుతున్న కొద్దీ వెండి ధరలు 100 డాలర్లకు మించిన స్థాయిలను చేరడం అసాధ్యం కాదని మార్కెట్ సంకేతాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ఆనంద్ రాఠీ షేర్స్, మోతీలాల్ ఓస్వాల్ వంటి సంస్థల నిపుణులు కీలక సూచనలు చేశారు. ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిల్లో ఉన్నందున కొత్తగా బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పద్ధతిలో లేదా తక్కువ పరిమాణంలో క్రమంగా కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Follow Us