/rtv/media/media_files/2025/07/10/sashithroor-2025-07-10-12-35-49.jpg)
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి. ఎమర్జెన్సీ కాలంలో స్వేచ్ఛ అనేది లేదంటూ విమర్శించారు. నాడు తీవ్రంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు శశిథరూర్. ప్రపంచానికి ఎమర్జెన్సీ రోజులు తెలియలేదన్న ఆయన.. 1975 నుంచి 1977 వరకు దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని వెల్లడించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ డైలీకి థరూర్ వ్యాసం రాశారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛను అణచివేశారని, ప్రజల హక్కులను కాలరాశారని ఆయన స్పష్టం చేశారు. ఈ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
My column for a global audience on the lessons for India and the world of the Emergency, on its 50th anniversary @ProSynhttps://t.co/QZBBidl0Zt
— Shashi Tharoor (@ShashiTharoor) July 9, 2025
రాజ్యాంగ విరుద్ధం కాదు
ఎమర్జెన్సీ విధించడం అప్రజాస్వామికం కావచ్చు, కానీ అది రాజ్యాంగ విరుద్ధం కాదు అని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో రాజ్యాంగంలోని నిబంధనలే ఎమర్జెన్సీ విధించడానికి అవకాశం కల్పించాయని ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. నాడు ఆయన బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరన్నారు. సమకాలీన రాజకీయ చర్చల్లో ఎమర్జెన్సీ ప్రస్తావనలు వస్తున్న నేపథ్యంలో శశిథరూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర ఆగ్రహంలో ఉంది. కాగా కొద్దిరోజులుగా కాంగ్రెస్‌పై పరోక్షంగా కామెంట్స్ చేస్తున్న శశిథరూర్... మోదీ, బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఇందిరా ఎమర్జెన్సీపై శశిథరూర్ రాసిన వ్యాసంపై కాంగ్రెస్ అధిఫ్టానం కఠిన చర్యల్లో భాగంగా వేటు వేస్తుందా లేదా అన్నది చూడాలి.