జైళ్లలో ఖైదీల పట్ల కుల వివక్ష చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఖైదీలతో అనుసరిస్తున్న తీరుపై మండిపడింది. కారాగారంలో కులం ఆధారంగా వివక్ష చూపిస్తున్నారని.. పనుల్లో కూడా విభజన చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. జైళ్లలో కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం లాంటి పనులు అప్పగిస్తున్నారని పిటిషనర్ తెలిపారు. ఇందులో ఊడ్చడం, మురుగును శుభ్రం చేయడం లాంటి పనులు అట్టడుగు వర్గాలకు అప్పగిస్తున్నారని.. వంటలు చేయడం, ఇతర పనులను మాత్రం అగ్ర వర్ణాలకు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ పిటిషన్‌పై విచారించింది.
Also Read: ఎంతకు తెగించార్రా.. ఐఫోన్ కోసం అలా చంపేస్తారా?
ఇది కరెక్ట్ కాదు
కులం ఆధారంగా పనుల్లో వివక్ష చూపించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి రూల్స్‌ను అమలుచేస్తున్న ఆయా రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పనులు విభజనకు దారితీస్తాయని.. కులం ఆధారంగా ఇలా పనులు అప్పగించడం సరైన పద్ధతి కాదని చురకలంటించింది. ఇది సమానత్వానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఖైదీలను మురుగు ట్యాంకులు శుభ్రం చేసేందుకు కూడా అనుమతించకూడదని చెప్పింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో పాటు 11 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఈ కుల వివక్షకు సంబంధించిన కేసులను పరిష్కరించడంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేసింది. న్యాయం ప్రకారమే ఖైదీలకు పనులను కేటాయించాలని ఆదేశించింది. మూడు నెలల్లోగా ఈ రూల్స్‌ను సవరించాలని చెప్పింది. ఇందుకోసం మూడు నెలల డెడ్‌లైన్‌ను కూడా విధించింది. మరోవైపు జైల్లలో ఇలా కుల వివక్ష చూపించి పనులు కేటాయించడం పట్ల నెటిజెన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పద్ధతిని అమలు చేస్తున్న కారాగారాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ సమానంగా, న్యాయంగా పనులు కేటాయించాలని చెబుతున్నారు.