లక్షల కోట్ల టారిఫ్‌లు రిఫండ్.. అమెరికా నుంచి భారత్‌కు డబ్బులు..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది.

New Update
Refund Trump on India

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం (IEEPA) కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ ఆర్థిక విధానాలకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో ఇప్పటివరకు ప్రభుత్వం వసూలు చేసిన సుమారు $175 బిలియన్ల (దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు) పైగా నిధులను తిరిగి ఆయా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇండియాపై ఎఫెక్ట్..

ట్రంప్ ఇండియాపై మొదట రెసిప్రోకల్ టారిఫ్ పేరుతో 25% సుంకం విధించారు. తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు అదనంగా మరో 25% పెనాల్టీ విధించడంతో మొత్తం 50%కి చేరింది. ట్రంప్ సర్కార్ భారత్‌పై 2025 ఆగస్టు 27 నుంచి 2026 ఫిబ్రవరి 2 వరకు భారీ సుంకాలు వసూలు చేసింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ తర్వాత టారిఫ్‌లు తిరిగి 50% నుంచి 18%కి తగ్గాయి. ట్రంప్ టారిఫ్‌లు మన దేశంపై ఒప్పందం ప్రకారం తగ్గినా.. మిగిలిన దేశాలపై కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా న్యాయస్థానం ఈ సుంకాలు చెల్లవని, ఇవి అక్రమమని చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం, పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు (పార్లమెంటు) మాత్రమే ఉంటుంది. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా ట్రంప్ ఈ సుంకాలు విధించారు. అయితే, "వ్యాపారాన్ని నియంత్రించడం" అంటే "సుంకాలు వసూలు చేయడం" కాదని, ట్రంప్ తన పరిధిని మించి వ్యవహరించారని 6-3 మెజారిటీతో కోర్టు తీర్పునిచ్చింది.

భారతీయులకు రీఫండ్ లభిస్తుందా?

ఈ తీర్పుతో గతంలో చెల్లించిన బిలియన్ల కొద్దీ డాలర్ల టారిఫ్‌లు రిఫండ్‌పై ఆశలు చిగురించాయి. రిఫండ్ అయ్యే డబ్బులు నేరుగా భారతీయ ఎగుమతిదారులు చెల్లించరు. అమెరికాలోని దిగుమతిదారులు వీటిని చెల్లిస్తారు. కాబట్టి, రీఫండ్ ఏదైనా ఉంటే అది అమెరికా కంపెనీలకే వెళ్తుంది. ఒకవేళ భారతీయ కంపెనీలు తమ సొంత అనుబంధ సంస్థల ద్వారా అమెరికాలో దిగుమతి చేసుకుని ఉంటే, అవి రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రీఫండ్ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉండబోతోంది. అమెరికా కస్టమ్స్ విభాగం ద్వారా దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

కోర్టు తీర్పును "అవమానకరం" అని అభివర్ణించిన ట్రంప్, వెంటనే తన ప్లాన్ బి అమలు చేశారు. కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే, మరో చట్టం (Section 122) కింద అన్ని దేశాల వస్తువులపై 10 శాతం కొత్త సుంకాన్ని విధిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఇటీవల భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం సుంకాలను 18 శాతానికి తగ్గించారు. ఈ ఒప్పందానికి ఎటువంటి ఇబ్బంది లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు వల్ల తక్షణమే భారీ సుంకాల భారం తగ్గడం భారత ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలకు సానుకూల అంశం. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టాల ద్వారా మళ్ళీ సుంకాలు విధించే అవకాశం ఉన్నందున, వ్యాపార వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు