స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఆయన పెళ్లికి ఆర్డర్ ఈ షాప్ నుంచే!

దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ఒకటి. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ని, ఢిల్లీలోని ఫేమస్ స్వీట్ షాప్ ఓనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా అభివర్ణించారు.

New Update
Ghantewala sweet shop

దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ఒకటి. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ని, ఢిల్లీలోని ఫేమస్ స్వీట్ షాప్ ఓనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా అభివర్ణించారు. అంతేకాదు, ఆయన త్వరగా పెళ్లి చేసుకుంటే తమకు పెళ్లి స్వీట్ల ఆర్డర్ వస్తుందంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా రాహుల్ గాంధీ పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాప్‌కు వెళ్లారు. ఆ షాపు యజమాని సుశాంత్ జైన్ ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ ఇమర్తీ (జాంగ్రీ), బేసన్ లడ్డూలు తయారు చేయడానికి ట్రై చేశారు. తర్వాత అక్కడి కార్మికులతో కలిసి సరదాగా గడిపారు.

ఈ స్వీట్ షాప్‌కు గాంధీ కుటుంబంతో నాలుగు తరాల అనుబంధం ఉంది. రాహుల్ తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి కూడా ఇమర్తీ స్వీట్ అంటే చాలా ఇష్టమని సుశాంత్ జైన్ గుర్తుచేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుశాంత్ జైన్.. "రాహుల్ జీని దేశమంతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అంటోంది. అందుకే, నేను ఆయనతో ఒక మాట అన్నాను. 'రాహుల్ జీ, దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి. మేము మీ ముత్తాతకు, అమ్మమ్మకు, మీ తండ్రికి, సోదరి వివాహాలకు ఇక్కడి నుంచే స్వీట్లు అందించాం. ఇప్పుడు మేం కేవలం మీ వివాహం కోసమే ఎదురుచూస్తున్నాం. మీ పెళ్లి స్వీట్ల ఆర్డర్ మా దుకాణానికే వస్తుందని ఆశిస్తున్నాం’ అని సరదాగా అడిగాను" అని తెలిపారు. స్వీచ్ షాక్ ఓనర్ మాటలకు రాహుల్ గాంధీ నవ్వుతూ స్పందించారు. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు.

Advertisment
తాజా కథనాలు