Weather Update: షాకింగ్ న్యూస్.. 43 మంది మృతి - హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

పంజాబ్‌లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. 23 జిల్లాల్లోని 1902 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ వరదల కారణంగా 43 మంది మృతి చెందగా, వేలాది ఎకరాల పంట నష్టపోయింది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

New Update
punjab flood villages submerged water 43 people dead

punjab flood villages submerged water 43 people dead

దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా వరదలు పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో కూడు, గూడుకు దూరమై నిరాశ్రయులయ్యారు. కరెంట్ స్తంభించిపోయింది. భారీ వరదల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. చెట్లు, కొండ చరియలు విరిగిపడి రోడ్లను బ్లాక్ చేశాయి. దీని కారణంగా రవాణాకు, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

వరదలతో 43 మంది మృతి

ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం దశాబ్దాలలో అత్యంత దారుణమైన వరద విపత్తును ఎదుర్కొంటోంది. ఈ ఊహించని ప్రకృతి విపత్తు ఎంతోమందిని బలిగొంది. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం మొత్తం వరదలతో పోరాడుతోంది. దీని కారణంగా ఇప్పటి వరకు దాదాపు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న పంటలు జలాశయమయ్యాయి. అంతేకాకుండా 23 జిల్లాల్లోని 1902 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. 

ఇప్పటి వరకు ఈ భారీ వరదలకు 3,84,205 మంది ప్రజలు ప్రభావితం కాగా.. మరో 20,972 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఈ 24 గంటల్లో మరో ఆరుగురు మరణించారు. దీంతో 14 జిల్లాల్లో మరణాల సంఖ్య ఇప్పుడు 43కి పెరిగింది. మరి ఏ ఏ జిల్లాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే విషయానికొస్తే.. 

ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 4 వరకు హోషియార్‌పూర్ (7), పఠాన్‌కోట్ (6), బర్నాలా - అమృత్‌సర్ (5 చొప్పున), లూథియానా - బటిండా (4 చొప్పున), మాన్సా (3), గురుదాస్‌పూర్ - SAS నగర్ (2 చొప్పున), పాటియాలా, రూప్‌నగర్, సంగ్రూర్, ఫజిల్కా, ఫిరోజ్‌పూర్ (1 చొప్పున) మరణాలు సంభవించాయని పంజాబ్ రెవెన్యూ, పునరావాసం, విపత్తు నిర్వహణ మంత్రి హర్దీప్ సింగ్ ముండియన్ అన్నారు. మరోవైపు పఠాన్‌కోట్‌లో ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం. 

దీంతోపాటు ఆయన మాట్లాడుతూ.. 23 జిల్లాల్లోని మొత్తం 1,902 గ్రామాలు వరదల కారణంగా ప్రభావితమయ్యాయని, 3.84 లక్షలకు పైగా జనాభా దీని బారిన పడ్డారని అన్నారు. ఇప్పటివరకు 20,972 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుండి తరలించారని తెలిపారు. అలాగే 1.71 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమిలో పంటలు దెబ్బతిన్నాయని, గురుదాస్‌పూర్, అమృత్సర్, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్, కపుర్తలా, మాన్సా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన అన్నారు.

Advertisment
తాజా కథనాలు