/rtv/media/media_files/2025/09/25/seethaiah-kilaru-2025-09-25-11-45-40.jpg)
SEETHAIAH KILARU
Pune University Scam : ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌నంటూ పుణె యూనివర్సిటీని బురిడీ కొట్టించిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.కోట్లు కాజేసిన అతడు హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ అని వెల్లడించారు. జులై 25-ఆగస్టు 26 మధ్య జరిగిన సైబర్ మోసం గురించి తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. పుణె యూనివర్సిటీకి చెందిన ప్రధాన అధికారి ఒకరికి పోన్ చేసిన ఒక వ్యక్తి తనను తాను ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. రూ.28 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు మీ విశ్వవిద్యాలయానికి ఇప్పిస్తామంటూ సదరు వ్యక్తిని నమ్మించాడు. అయితే.. ఆ ప్రాజెక్టులు మీకు దక్కాలంటే అడ్వాన్స్‌గా కొంత సొమ్ము చెల్లించాలని మభ్యపెట్టాడు. అలా చెప్పి తొలుత రూ.56 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. ఇలాగే పలు ప్రాజెక్టుల పేరుతో వివిధ రూపాల్లో ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి మొత్తంగా రూ.2.46 కోట్లు కాజేశాడు. ప్రాజెక్టుల పై ఒప్పందం చేసుకునేందుకు త్వరలోనే యూనిర్సిటీకి వస్తామంటూ మాయమాటలు చెప్పడంతో వారు నమ్మారు. తీరా కాలం గడుస్తున్నా ఎవరూ రాకపోయేసరికి వారు ఐఐటీ ప్రొఫెసర్‌ను సంప్రదించారు. అయితే తాను ఎలాంటి ప్రాజెక్టు ఒప్పందాలు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ మోసం వెనుక ఉన్న కీలక వ్యక్తి పేరు కిలారు సీతయ్యగా గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన సీతయ్య ఈ మోసం కేసులో అతడే ప్రధాన సూత్రధారి అని తేలింది. కాగా సెప్టెంబర్ 21న సీతయ్యను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.. యూకేకు చెందిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందినట్లు తెలుస్తోంది. 2019-20లో తాను యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ పాసైనట్లు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం కోర్టు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది.
ఉద్యోగాల పేరుతో మోసం..
కాగా, కిలారు సీతయ్య గతంలోనూ పలు మోసాలకు పాప్పడినట్లు తేలింది. పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కిలారు సీతయ్య నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశాడు. ఆ నగదుతో ఆన్‌లైన్ గేమ్స్, ట్రేడింగ్, జల్సాలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిలారు సీతయ్య అనే వ్యక్తి లింక్డిన్, నౌకరీల ద్వారా నిరుద్యోగులను టార్గెట్ చేశాడు. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా పేరుతో వారికి ఫోన్లు చేసి జాబ్ ఆఫర్ చేశాడు. ఉద్యోగం కావాలంటే తాను చెప్పినంత నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇన్నాళ్లూ కాళీగా ఉన్న తమకు ఉద్యోగం రాబోతుందని ఒక్కొక్కరు ఆశతో లక్షలు చెల్లించారు. వారు చెల్లించిన సొమ్ముతో కిలారు సీతయ్య జల్సాలు చేసినట్లు తెలిసింది. ఒక్కసారిగా లక్షలు వచ్చి చేతిలో పడడంతో ఆన్‌లైన్ గేమ్స్, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేశాడు. డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైనా ఉద్యోగం చూపించకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా పేరుతో ఫోన్లు చేసింది సీతయ్యగా గుర్తించారు. దీంతో అతనిపై మెుత్తం 8కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా జైలు నుంచి విడుదల అయిన సీతయ్య మరోసారి మోసానికి పాల్పడడం గమనార్హం.