Operation Sindoor : తహెల్గాం దాడులపై భారతదేశం ప్రతీకార దాడులకు దిగడంతో నిన్న మొన్నటి వరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కొంత బయపడినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ మంగళవారం రాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేయడంతో కొంత వెనక్కు తగ్గింది. తమ దేశంలో ఉగ్రస్థావరాలు లేవని బొంకుతూ వస్తున్న పాకిస్థాన్‌కు భారత్ తగిన బుద్ధి చెప్పడంతో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ మెరుపు దాడులతో ఖవాజా కొంత దిగివచ్చినట్లు కనిపిస్తుంది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాకిస్థాన్ కాల్పులు విరమించుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్ తన చర్యలను నిలిపివేస్తే పాకిస్థాన్ సైన్యం కూడా కాల్పులను విరమిస్తుందని స్పష్టం చేశారు. భారత్ తన చర్యలను కొనసాగిస్తే మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా అని అన్నారు. అయితే పాకిస్థాన్ పహెల్గాం దాడులు జరిగిన నాటి నుంచి సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరుపుతూనే ఉంది. భారతీయ ఆర్మీతో పోరాడకుండా జమ్మూకశ్మీర్ బార్డర్ వద్ద సామాన్యులపై దాడులకు పాల్పడుతోంది.
కాగా పహెల్గాం దాడుల తర్వాత రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ కనుక పాకిస్థాన్‌పై దాడి చేసే సాహసానికి ఒడిగట్టి.. పాక్ ఉనికికి ముప్పు ఏర్పడితే.. ప్రపంచంలోనే ఎవ్వరూ మిగలరని అన్నారు. అంతేకాకుండా, ఇండియా, పాక్ మధ్య పరిస్థితిని గాజాపై ఇజ్రాయెల్ దాడితో పోల్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ స్నేహితుడు కూడా అదే మనస్తత్వం ప్రదర్శిస్తున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించారు. కాగా భారత్ మెరుపు దాడులతో దిగివచ్చిన పాక్ తాజాగా కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చింది.