Security forces in Bastar: ఆపరేషన్ బస్తర్‌..అన్నలతో ఆఖరి యుద్ధం!

దేశంలో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని ఖరాఖండిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం..ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంతో దళాలు ముందుకు సాగుతున్నాయి.

New Update
Encounter in Chattisgarh, 5 Maoists killed

Chattisgarh ..Security forces in Bastar

Security forces in Bastar : దేశంలో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని ఖరాఖండిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం..ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.అందులో భాగంగా ఓవైపు మావోయిస్టు కీలక నేతల ఎన్‌కౌంటర్లతో పాటు, పలువురు నేతలు లొంగుబాట పడుతున్నారు. మరోవైపు ముఖ్యమైన నాయకులను ఎన్ కౌంటర్ల పేరుతో మట్టుబెడు తున్నారు. గత నెలలో మావోయిస్టు టాప్‌ కమాండర్‌ హిడ్మాను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. ప్రస్తుతం మావోయిస్టు కీలక నేతలు పాపారావు, దేవాలపై దృష్టి సారించాయి. వారిని ఎలాగైన మట్టుబెట్టాలన్న లక్ష్యంతో దళాలు ముందుకు సాగుతున్నాయి. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కానప్పటికీ.. పార్టీలో వారికి ఉన్న అనుభవం, స్థానికులతో లోతైన సంబంధాలు, ఛత్తీ్‌సగఢ్‌ దక్షిణ బస్తర్‌ ప్రాంతాలపై ఉన్న పట్టు మూలంగా భద్రతా బలగాల వారిని మోస్ట్ వాంటెడ్ గా భావిస్తున్నాయి. కాగా బస్తర్ ప్రాంతంలో ఇప్పటికీ 150 మందికి పైగా సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

కీలక సమాచారంతో...

ఒకవైపు మావోయిస్టు నాయకుల కోసం వేట కొనసాగిస్తూనే వారి మూలాలపై భద్రతా దళాలు దృష్టి సారించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలోని మీనగట్ట గ్రామ సమీపంలోని అటవీ కొండలలో నక్సల్స్ నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు సోమవారం కూల్చివేశాయి. ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు చెందిన 150వ బెటాలియన్, జిల్లా పోలీసుల సంయుక్త బృందం లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ప్రారంభించి, రహస్య విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీన్ని మావోయిస్టు తిరుగుబాటుకు గణనీయమైన దెబ్బగా భావిస్తున్నారు. నక్సల్ ప్రభావిత ఈ హాట్‌స్పాట్‌లో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని సాయుధ కార్యకలాపాలను ముమ్మరం చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో, ఆయుధాలు,మందుగుండు సామగ్రిని ఉత్పత్తి చేయడానికి మావోయిస్టులు ఈ కేంద్రాన్ని చురుకుగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.ఈ దాడిలో, అధికారులు గణనీయమైన మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు,తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

లొంగుబాటు నేతల లీక్ తో...

కాగా ఇటీవల లొంగిపోయిన పలువురు మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఆయుధ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఆయుధ సమాచారంతో పాటు పలువురు కీలక నేతల సమచారం కూడా వారి నుంచి సేకరించిన భద్రతా దళాలు అక్కడ కార్యకలపాలు నిర్వహిస్తున్న పాపారావు, దేవాలపై దృష్టి సారించాయి. వీరిలో 48 ఏళ్ల బర్సాదేవా మావోయిస్టు పార్టీ కీలకమైన గెరిల్లా బెటాలియన్‌కు నాయతక్వం వహిస్తున్నారు. ఆయన సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పూవర్తికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఇక 57 ఏళ్ల పాపారావు కూడా  సుక్మా జిల్లాకు చెందిన వాడే. ఆయన కిష్టారానికి చెందిన గిరిజన నేత. వీరిద్దరూ మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన దక్షిణ బస్తర్‌కు నాయకత్వం వహిస్తున్నారు. బర్సా దేవా నేతృత్వంలోని ‘ది పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)’ బెటాలియన్‌ ఒక్కటే ఇంకా క్రియాశీలంగా ఉందని బస్తర్‌ ఐజీ పీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. భద్రతా బలగాలు ఇప్పుడు పాపారావు, దేవాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ల బస్తర్ ను ముమ్మరం చేశాయి.

 భారీగా ఆయుధాలు స్వాధీనం

 బస్తర్ లోని మావోయిస్టుల కీలక స్థావరంపై దాడి చేసిన భద్రతాదళాలు అక్కడ పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో ఎనిమిది సింగిల్-షాట్ రైఫిళ్లు, 15 12-బోర్ కార్ట్రిడ్జ్‌లు, ఐదు ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 30 మీటర్ల కార్డెక్స్ వైర్, రెండు కిలోల PEK పేలుడు పదార్థాలు, ఒక కిలో ANFO (అమ్మోనియం నైట్రేట్ ఇంధన నూనె), 10 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఎనిమిది వైర్‌లెస్ VHF సెట్‌లు, ఒక వెల్డింగ్ మెషిన్, ఇతర సామాగ్రి, మావోయిస్టు యూనిఫాంలు, ప్రచార సాహిత్యం ఉన్నాయి.కాగా నక్సల్ హింసను నిర్మూలించడంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఎస్పీ పునరుద్ఘాటించారు, జనవరి 2024 నుండి, సుక్మా జిల్లాలోనే మొత్తం 599 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 460 మందిని అరెస్టు చేశారని 71 మంది ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టామని తెలిపారు. 

కాగా ఈ ఏడాది డిసెంబరు 9 వరకు బస్తర్‌లో మొత్తం 96 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిల్లో 252మంది యావోయిస్టులు మరణించగా.. 23మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారిలో సీపీఐ(మావోయిస్టు) చీఫ్‌ నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజుతో పాటు మరో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా, ఇదే సమయంలో పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఈ ఏడాదిలో మావోయిస్టులు 46 మంది పౌరులను హతమార్చారు. కాగా దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2014లో 126 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండగా.. ఈ ఏడాదికి ఆ సంఖ్య 11కు పడిపోయింది. ఈ విజయం ఛత్తీస్‌గఢ్ అంతటా తీవ్రతరం చేసిన నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో భాగమని,బస్తర్ డివిజన్‌లో శాంతిని పునరుద్ధరించడానికి భద్రతా దళాలు తిరుగుబాటుదారుల మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో కూల్చివేస్తున్నాయని భద్రతా దళాలు వెల్లడించాయి. 

Advertisment
తాజా కథనాలు