మహారాష్ట్రంలో నవంబర్ 20న ఒకేదశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 288 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే వాళ్లలో 921 మంది నామినేషన్ల పేపర్లను అధికారులు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది. అక్టోబర్ 29 నాటికి ఇది ముగిసింది. ఇక అక్టోబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 చివరి తేదీగా ఉంది.
Also Read: పొగలో చిక్కుకున్న ఢిల్లీ.. ప్రజలు ఇక్కట్లు!
మహాయుతి VS మహా వికాస్ అఘాడీ
నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైన మహాయుతి కూటమిని గద్దె దించి అధికారంలోకి రావాలని మహా వికాస్ అఘాడీ కూటమి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ కూటమిలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన విపక్ష పార్టీలు ఉన్నాయి.
మహారాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో తొలిసారిగా ఓటువేసేవారు 2 శాతం మాత్రమే ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లలో 5 కోట్ల మందికి పైగా పురుషులు ఉండగా.. 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య తొలిసారి ఓటు వేసేవారు 22.22 లక్షల మంది ఉన్నట్లు ఈసీ చెప్పింది. మరోవైపు 100 ఏళ్లు దాటిన వృద్ధులు 21,089 ఉన్నారని పేర్కొంది. 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 72 లక్షలకు పెరిగింది.
Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటింగ్
ఇదిలాఉండగా ఇక ఝార్ఖండ్‌లో 13, 20 తేదీల్లో రెండు విడుతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలపై కూడా ఎవరు అధికారంలోకి వస్తారనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.