కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి సక్సెస్.. బీజేపీని బోల్తా కొట్టించిన 4 అంశాలివే!

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మెజార్టీ పోల్ సర్వేలు చెప్పినట్లుగానే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠం ఖరారైపోయింది. బీజేపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By B Aravind
modi and rahul
New Update

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మెజార్టీ పోల్ సర్వేలు చెప్పినట్లుగానే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠం ఖరారైపోయింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో  దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అనేక వ్యూహాలు రచించినప్పటికీ అవి ఫలించలేదు. చివరికి నెషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు జమ్మూకశ్మీర్ ప్రజలు జై కొట్టారు. అయితే బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.    

ఆర్టికల్ 370 రద్దు వివాదం

జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఒకటి జమ్మూకశ్మీర్‌ కాగా.. మరోకటి లడఖ్. ఈ పరిణామం జరిగిన తర్వాత ఈ రెండు ప్రాంతాల్లో కొన్ని నెలల పాటుగా అనేక ఆంక్షలు కొనసాగాయి. పరిస్థితులు సాధారణ స్థితికి రావడం మొదలయ్యాయి. స్పెషల్ స్టేటస్‌ను రద్దు చేశారని ప్రజల్లో ఉన్న అంసతృప్తిని దూరం చేసేందుకు మోదీ ప్రభుత్వం నయా కశ్మీర్‌ అనే పేరుతో ముందుకు వచ్చింది. అభివృద్ధి, ఉద్యోగాలు, భద్రతా వంటి హామీలు ఇచ్చింది.  అయినప్పటికీ బీజేపీ ప్రయత్నాలు ఫలించలేవు. 

యాంటీ కశ్మీరీ వ్యూహం

ఆర్టికల్ 370 రద్దు వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమయ్యింది. ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్‌ డెమోక్రటిక్ పార్టీ (PDP)లు బీజేపీపై యాంటీ కశ్మీరీ ముద్ర వేయడంలో విజయం సాధించాయి. ఇందుకు కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు వచ్చింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఇక చివరికి ఈ ఎన్నికల్లో పీడీపీ స్వతంత్రంగా బరిలోకి దిగినప్పటికీ.. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేశాయి. దీంతో జమ్మూకశ్మీర్‌ ప్రజలు బీజేపీని పక్కన పెట్టి..  నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపి అధికారాన్ని కట్టబెట్టారు. 

ప్రజలపై అణిచివేత


 జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రవాదం, వేర్పాటువాదం వంటి వాటిపై బీజేపీ చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది. దీన్ని అక్కడి ప్రజలు కూడా స్వాగతించారు. కానీ తమ భావా ప్రకటన స్వేచ్ఛను అణిచి వేస్తున్నారని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఇది బీజేపీకి పెద్ద మైనస్‌గా మారింది. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు అయినప్పటికీ కూడా ఉగ్రదాడులను బీజేపీ పూర్తిగా నిర్మూలించలేపోయింది.   

హామీలు నెరవేర్చడంలో విఫలం

జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమయ్యాక.. బీజేపీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే పెట్టుబడులు తీసుకొస్తామని.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పింది. అయినప్పటికీ దీనికి సరైన ముందడుగులు పడలేదు. దీంతో తమకిచ్చిన హామీల్లో పురోగతి కనిపించకపోవడం పట్ల అక్కడి ప్రజల్లో అసంతృప్తి మొదలయ్యింది. ఇది కూడా బీజేపీకీ ప్రతికూల అంశంగా మారింది.    

బీజేపీని తిప్పికొట్టిన ప్రాంతీయ ప్రభావం

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. గతంలో ఈ రెండు పార్టీలు కూడా అక్కడ అధికారంలో ఉన్నాయి. గతంలో పీడీపీ, బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, వివిధ అంశాల వల్ల  ఈ రెండు పార్టీలు విడిపోయాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ.. ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకోసం సొంతంగానే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. అలాగే అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలను కూడా కలుపుకుంది. కానీ ఈ రెండు పార్టీలు ప్రభావాన్ని చూపించలేకపోయాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ లాంటి పార్టీలను ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి. 

సీఎంగా ఒమార్ అబ్దుల్లా ?

దీంతో నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌ కూటమి వైపే జమ్మూకశ్మీర్‌ ప్రజలు మొగ్గు చూపారు. పీడీపీ సొంతంగానే బరిలోకి దిగినప్పటికీ కొన్ని సీట్లకు మాత్రమే పరిమితమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారుఖ్ అబ్దుల్లా కొడుకు ఒమార్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌ సీఎంగా అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఈయనకు జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.   

#telugu-news #congress #national-news #jammu and kashmir election
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe