ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పనిచేయాలని ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రముఖ నటి దీపిక పదుకొనె, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంక కూడా సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి కూడా వారానికి 70 గంటల పాటు పనిచేయాలన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఆనంద్ గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్ మహింద్రా స్పందించారు. తాను పనిలో నాణ్యతను చూస్తానని.. పని సమయాన్ని కాదని పేర్కొన్నారు.
Also Read: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు
ఢిల్లీలో జరిగిన వికాస్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' నారాయణ మూర్తి అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఇది తప్పుగా భావించడం లేదు. కానీ నేను చెప్పేదేంటంటే ఈ చర్చ ఓ తప్పుడు దారిలో వెళ్తోంది. మనం పని పరిణామం కన్నా.. నాణ్యతపై దృష్టి పెట్టాలి. 48, 40 గంటల గురించి, 70 గంటలు, 90 గంటల గురించి కాదని'' అన్నారు. అయితే ఆనంద్ మహీంద్రాను ఎన్ని గంటలు పనిచేస్తారని అడగగా ఆయన సూటిగా సమాధానం చెప్పకపోయినా.. పని నాణ్యత ముఖ్యమని తెలిపారు.
అలాగే ఎక్స్‌లో ఎంత సమయం గడుపుతారో అన్న ప్రశ్నకు కూడా ఆనంద్ మహీంద్రా సమాధానం ఇచ్చారు. తాను స్నేహితులను పరిచయం చేసుకునేందుకు సోషల్ మీడియా వాడనని.. అది ఒక అద్భుతమైన బిజినెస్ టూల్ అని చెప్పుకొచ్చారు. '' నేను ఒంటరిగా ఉన్నానని ఎక్స్‌లో సమయం గడపడం లేదు. నా భార్య అద్భుతమైంది. ఆమెను చూస్తూ ఉండిపోవడం అంటే ఇష్టం. సోషల్ మీడియాలో నేను ఎక్కువ సమయం గడుపుతాను. స్నేహితులను పరిచయం చేసుకోవడానికి కాదు. అది ఒక మంచి బిజినెస్ టూల్. ఇది చాలామందికి తెలియదని'' ఆనంద్ మహీంద్రా అన్నారు.
“My wife is wonderful, I love staring at her”, Mahindra Group Chairman @anandmahindra tells Firstpost Managing Editor @palkisu at Viksit Bharat Young Leaders Dialogue.#VBYLD2025 pic.twitter.com/6fYKgC80rW
— Firstpost (@firstpost) January 11, 2025