సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఏ శక్తీ ఆపలేదు...ఇది ఫ్రెంచ్ తత్వవేత్త విక్టర్ హ్యూగో మాట. దీనిని పాటించి చూపించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. భారతదేశం ప్రపంచశక్తిగా, ఆర్థిక శక్తిగా మారే సమయం వచ్చిందని, దానిని ఎవరూ ఆపలేరు అంటూ అప్పటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలు భారత ప్రగతిని పూర్తిగా మార్చేశాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచీ భారత దేశం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీని కోసం ఆర్ధిక సంస్కరణలు చాలా అవరమని అందరికీ తెలుసు కానీ రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లేదు. ఎవరూ ఆర్ధిక సంస్కరణలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో 1980 లలో ఈ సమస్యలు మరింత పెరిగాయి. 1990 నాటికి ఈ సమస్యలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రూపాన్ని సంతరించుకున్నాయి.
బంగారం తాకట్టు వివాదం..
1991 కన్నా ముందు భారత దేశం భారీ రుణాలు తీసుకునే దేశం కాదు. కానీ అప్పటి పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంతకు ముందు వరకు చిన్న చిన్న రుణాల పైనే ప్రభుత్వం ఆధారపడింది. 5 బిలియన్ డాలర్లకు రుణం చెల్లించాల్సి ఉంది. దానిపై వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బు లేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఆర్‌బీఐ దగ్గరున్న బంగారు నిల్వలను రెండు విదేశీ బ్యాంకుల దగ్గర తనఖా పెట్టింది ప్రభుత్వం.
చమురు సంక్షోభం...
అయితే ఎంత బంగారం తాకట్టు పెట్టినా భారత్‌కు పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు. ఇంకా ఆర్ధిక కష్టాల్లోనే ఉంది. ఈలోపు గల్ఫ్ యుద్ధం మొదలైంది. ఇది భారత దేశానికి రెండు రకాల సమస్యలను తెచ్చిపెట్టింది. మొదటిది దౌత్యపరంగా ఇరాక్, అమెరికాలలో ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకోవాల్సి రావడం. రెండవది, యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేయడం.యుద్ధానికి ముందు భారతదేశం ప్రతి నెలా చమురు దిగుమతుల కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసేది. యుద్ధం ప్రారంభమైన తరువాత ఆ ఖర్చు నెలకు రూ. 1200 కోట్లకు చేరింది.
మన్మోహన్ ఎంట్రీ...
ఇటువంటి సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పు ఇచ్చింది. కానీ 25 షరతులు విధించింది. ఇందులో భారత దేశ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ ఎకానమీగా మార్చడం ఒకటి. అలాగే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు అంగీకరించాలి. ఈసమయంలోనే మన్మోహన్ ఎంట్రీ ఇచ్చారు. 1991 మే లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వకపోవడంతో పీవీ నరసింహారావు రాజకీయాల నుండి సగం రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ విధి మరోలా ఉంది. రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు. ఈయన ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా మొదట ఆర్థికవేత్త ఐజీ పటేల్‌ను అనుకున్నారు. కానీ చంద్రశేఖర్ ఆర్థిక సలహాదారుగా పని చేస్తున్న మన్మోహన్ సింగ్ పై పీవీ దృష్టి పడింది. అప్పటికి సింగ్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో డాక్టర్ సింగ్‌కు మంచి పేరు ఉంది. దీని కారణంగా అంతర్జాతీయ బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందవచ్చు అనే ఉద్దేశంతో మన్మోహన్ ను ఆర్థిక మంత్రిని చేయడం వెనుక ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు ఉద్దేశం. ప్రధానిగా ఆయన తీసకున్న నిర్ణయాల్లో చాలా మంచిది..భారత అభివృద్ధికి తోడ్పడింది ఇదే. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేశారు. ఆయనకు వెనకుండి మేం మద్ధతిచ్చాంఅని శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ నరసింహారావు స్వయంగా చెప్పారు.
మన్మోహన్ తెచ్చిన ఆర్ధిక సంస్కరణలను వామ పక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించేవి. కానీ ప్రధానిగా పీవీ ఆయనకు అండగా నిలబడ్డారు. జూన్ 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పడింది. మరుసటి నెలలోనే చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ దేశం గతిని మార్చేసింది. సాధారణంగా బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి మూడు నెలల సమయం పడుతుంది. కానీ, మన్మోహన్ సింగ్ నెల రోజుల్లోనే దానిని సిద్ధం చేశారు. ఇందులోనే మన్మోహన్ తన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా పరిశ్రమల శాఖలో అనేక మార్పులు చేశారు. దీంతో ఈ శాఖను పీవీ తన వద్దే ఉంచుకున్నారు. తన సహచరుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన సంస్కరణలు అమలు చేశారు.కొద్దికాలంలోనే దాని ఫలితాలు కనిపించడం ప్రారంభించాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం మొదలైంది. విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అయితే, విదేశీ కంపెనీల రాక వల్ల భారతీయ కంపెనీలు దెబ్బతింటాయని లేదంటే విదేశీ కంపెనీలకు లోకల్ సప్లయర్లుగా మిగిలిపోతాయన్న ఆందోళన అప్పట్లో చాలా వ్యక్తం అయింది. కానీ భయపడినట్టుగా ఏమీ జరగలేదు. దానికితోడు మార్కెట్లో మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కోట్ల మంది ప్రజలు మొదటిసారిగా దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారు.
1991 బడ్జెట్ ముఖ్యాంశాలు..
1991 బడ్జెట్ హైలైట్స్
దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంపు
లైసెన్సింగ్ రాజ్ కు చరమగీతం.
ఎగుమతులకు ప్రోత్సాహం , దిదగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులు.
ఫారిన్ ప్రత్యక్ష పెట్టుబడులతో ఉద్యోగాలు.
సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు ప్రోత్సాహం.
ఈ బడ్జెట్‌ను ఆధునిక దేశ చరిత్రలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటిగా పరిగణిస్తారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు ఈ బడ్జెట్ క్రెడిట్ దక్కింది.