కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వైద్యులు ఇంకా నిరసనలు చేస్తూనే ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యుల మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం మమతా బెనర్జీ శనివారం మధ్యాహ్నం జూనియర్ వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లారు. దీంతో ఆమెను చూడగానే న్యాయం కావాలంటూ అక్కడున్న వాళ్లందరూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జూనియర్ వైద్యులతో ఇలా మాట్లాడారు.
Also Read: గచ్చిబౌలిలో ఘోరం.. ఆస్తి కోసం బామ్మర్దిని బావ ఏం చేశాడంటే?
” గతంలో నేను కూడా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమాల్లో పాల్గొన్నాను. నిరసనలు చేసే హక్కు మీకుంది. కానీ సమస్యను పరిష్కరించేందుకు మీతో చర్చించేందుకు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. భద్రతా సిబ్బంది వద్దని చెప్పినా కూడా మీ ఆందోళనలకు సెల్యూట్ చేయడానికే వచ్చా. ఇక్కడికి నేను సీఎంగా రాలేదు. మీ సోదరిగా వచ్చా. నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు. బాధితురాలికి న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎండా, వానల్లో కూడా రోడ్లపై మీరు ఆందోళన చేస్తుంటే నేను కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. మీ డిమాండ్లను కచ్చితంగా అధ్యయనం చేస్తాం.
బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. ఆర్జీకర్ ఆస్పత్రిలో రోగుల సంరక్షణ కమిటీని రద్దు చేస్తున్నాను. ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేయాలని సీబీఐని కోరుతున్నాను. నా మీద నమ్మకం ఉంటే చర్చలకు రండి. వెంటనే విధుల్లో చేరండి. మీపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోం” అని మమతా బెనర్జీ అన్నారు. తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా.. హత్యాచార కేసులో నిందుతుడైన సంజయ్ రాయ్ ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.
Also Read: నర్సుపై డాక్టర్ అత్యాచారయత్నం.. మర్మాంగం కోసేసిన బాధితురాలు!