/rtv/media/media_files/2025/11/22/fotojet-2025-11-22t092142356-2025-11-22-09-22-06.jpg)
Major reforms in labor laws
Historic Labour Law Reforms: సుదీర్ఘకాలంగా సంస్కరణలకు నోచుకోని కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అనేక ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్‌లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగా గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రత కల్పించడం, ఉద్యోగులందరికీ తప్పనిసరిగా నియామక పత్రాలు అందించడం, అన్ని రంగాల్లో ఉద్యోగులకు కనీస వేతనాలు.. క్రమం తప్పకుండా అందించడం వంటి అనేక సంస్కరణలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు సుదీర్ఘకాలంగా అమలుకు నోచుకోని వేతనాల కోడ్ (2019); పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020); సామాజిక భద్రత కోడ్ (2020); వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ (2020)లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అనేక దేశాలు ఇప్పటికే తమ కార్మిక చట్టాలను సరళీకరించి, ఏకీకృతం చేసినప్పటికీ మనం మాత్రం సంక్లిష్టమైన, కాలం చెల్లిన చట్టాలనే నేటికి కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఏకీకృత, ఆధునికీకరించిన నాలుగు కోడ్‌లను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిజానికి కొత్త కార్మిక కోడ్‌లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించింది. కానీ, కొన్ని రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా చట్టాలు అమలు చేయడం వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా నాలుగు కార్మిక స్మృతులను కేంద్రం అమల్లోకి తేవడంతో సమగ్ర నిబంధనలు, పథకాల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించనుంది. అదే సమయంలో కొత్త కోడ్‌లు అమల్లోకి వచ్చినప్పటికీ అవసరమైనప్పుడు ప్రస్తుత కార్మిక చట్టాల్లోని నిబంధనలు కూడా వర్తిస్తాయని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. కాగా, 2015లో దేశంలో సామాజిక భద్రత కవరేజ్ 19 శాతం ఉండగా.. 2025 నాటికి ఇది 64 శాతానికి చేరినట్లు తెలిపింది. కొత్త కోడ్‌ల అమలుతో కార్మిక అనుకూల వ్యవస్థను ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడిందని తెలిపింది.
తాజా కోడ్‌లు అమల్లోకి వస్తే మహిళల హక్కులు, భద్రతను మరింత పెంచడం, ప్రమాదకరమైన ప్రాసెసింగ్ కేంద్రాలు సహా అన్ని చోట్లా దేశవ్యాప్తంగా ఈఎస్‌ఐసీ సౌకర్యం కల్పించడం, సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సంస్కరణలు ఉన్నాయి. ఈ నాలుగు స్మృతుల మూలంగా ఉపాధిని సంఘటితం చేయడం, కార్మికుల సంరక్షణను బలోపేతం చేయడం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతో పాటు అంతర్జాతీయంగా అనుసంధానించవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వివరించారు. ఈ కోడ్‌లు ఆత్మనిర్భర భారత్‌కు పునాది లాంటివని ఆయన అన్నారు.
నాలుగు స్మృతుల్లో ప్రధాన అంశాలు :
-ఉద్యోగులందరికీ ఉద్యోగ నియామక పత్రాలు తప్పనిసరిగా ఇవ్వాలి.. దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి హామీ లభిస్తుంది.
-గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత కల్పించాలి. అంటే పీఎఫ్, ఈఎస్‌ఐసీ, బీమా మొదలైనవి.
-ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు (ఎఫ్‌టీఈ) కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించడం. ఎఫ్‌టీఈలు ఐదేళ్ల వరకు వేచి చూడకుండా కేవలం ఏడాది సర్వీసు పూర్తిచేస్తే గ్రాట్యుటీకి అర్హులవుతారు.
-కార్మికులందరికీ కనీస వేతనం అనేది ఇక మీదట చట్టబద్ధమైన హక్కు. యజమానులు సకాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాలి. అనధికారికంగా ఎలాంటి కోతలూ విధించడానికి వీలులేదు.
-బీడీ, సిగరెట్లు, మైనింగ్ పరిశ్రమల్లో రోజుకు 8-12 గంటల వరకు పనిచేసుకునే అవకాశం. అదే సమయంలో వారానికి 48 గంటలు మించకూడదు. 30 రోజుల పని పూర్తి చేసుకుంటే బోన్‌స్ చెల్లించాలి.
-ఉద్యోగులకు 40 ఏళ్లు పైబడితే యాజమాన్యాలు ఏటా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలి.
-సమాన పనికి సమాన వేతనం ఇక మీదట తప్పనిసరి. ట్రాన్స్‌జెండర్‌తో సహ లింగ వివక్ష చూడరాదు
-సాధారణ పని గంటలకు మించి ఓటీ (ఓవర్ టైమ్) పని చేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు వేతనం చెల్లించాలి.
న్ని రకాల పనుల్లో (భూగర్భ గనులు సహా) అన్ని షిఫ్టుల్లో మహిళలు పనిచేయడానికి అనుమతి. అయితే అవసరమైన భద్రతా చర్యలతో పాటు వారి సమ్మతి తప్పనిసరి.
-మహిళా ఉద్యోగులు ఉంటే వారి కుటుంబంలో అత్తమామలకు కూడా చోటు. తద్వారా ‘డిపెండెంట్ కవరేజ్’ పెరిగే అవకాశం.
-ఈ కోడ్ ద్వారా గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు తొలిసారి చట్టంలో నిర్వచనం చెప్పడం జరిగింది. గిగ్ వర్కర్ అంటే సాధారణ, సంప్రదాయ యాజమాన్యాలు ఏర్పాటు చేసే ఆఫీసుల్లో పనిచేసేవారు కాదని. ప్లాట్‌ఫాం వర్కర్ అంటే ఆన్‌లైన్ వేదికల ద్వారా సేవలందించేవారు. ఆన్‌లైన్ అగ్రిగేటర్ అంటే.. సేవలందించేవారికి, వినియోగదారులకు మధ్య అనుసంధానకర్త అని నిర్వచించింది.
-అగ్రిగేటర్లు (ఉబెర్, ఓలా, స్విగ్గీ వంటి సంస్థలు) తమ వార్షిక టర్నోవర్‌లో 1-2ు (కార్మికులకు చెల్లించే మొత్తంలో 5ు వరకు) సామాజిక భద్రత నిధికి కేటాయించాలి.
-ఆధార్ అనుసంధానిత ‘యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)’ ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాలు అనేవి రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పోర్టబుల్‌గా ఉండనున్నాయి.
-జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లు, డబ్బింగ్ కళాకారులు, మీడియా వృత్తి నిపుణులు అంతా కూడా కార్మిక రక్షణ విధివిధానాల పరిధిలోకి రానున్నారు. నియామక పత్రాలు, వేతనాల భద్రత, పనివేళల నియంత్రణ వారికి తప్పనిసరి.
-కాంట్రాక్ట్, వలస కార్మికులకు కూడా రెగ్యులర్ కార్మికులతో పాటు సమాన వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలన్నీ కల్పించాలి. కాంట్రా క్ట్ సిబ్బందికి యాజమాన్యాలు సామాజిక భద్రత కల్పించాలి. పని స్థలాల్లో తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి.
Follow Us