/rtv/media/media_files/2025/02/08/OMfcibOY3yqozmIJP3Dk.jpg)
Resons Behind BJP Victory in Delhi Assembly Elections
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు బిగ్ షాక్ తగిలింది. బీజేపీ ఓటమి వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే బీజేపీ మెజార్టీ మార్క్‌ను కూడా దాటేసి అధికారం వైపు అడుగులు వేస్తోంది. ఆప్ కీలక నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓడిపోయారు. 2013లో హంగ్‌తో అధికారంలోకి వచ్చిన ఆప్.. వరుసుగా 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సంగతి తెలిసిందే. కానీ 2025లో మాత్రం ఢిల్లీ ప్రజలు ఆప్‌ను తిరస్కరించారు. ఇందకు ప్రత్యమ్నాయంగా బీజేపీకి అధికారం అప్పజెప్పారు. గత 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీకి ఎట్టకేలకు ఈసారి ఢిల్లీ వాసులు అవకాశం కల్పించారు. ఈసారి బీజేపీ విజయానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పనిచేసిన మోదీ మ్యాజిక్
2014 ఎన్నికల తర్వాత బీజేపీ ప్రతి ఎన్నికల్లో కూడా ప్రధానంగా ప్రధాని మోదీని చూపెడుతూ ఎన్నికల ప్రచారం చేసింది. ఆప్ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అని అందరికీ తెలిసిందే. కానీ బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే మోదీని నమ్ముకుని బరిలోకి దిగింది. మోదీ మ్యాజిక్ ఇక్కడ పనిచేసినట్లు కనిపిస్తోంది.
అవినీతికి చెక్
ఢిల్లీలో లిక్కర్, వాటర్ స్కామ్ వంటి అంశాలు పెను దుమారం రేపాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ బడా నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు అరెస్టయిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే వీళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆప్ అవినీతికి పాల్పడిందనే విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. దీంతో ఇది ఆప్‌కు అతిపెద్ద మైనస్‌గా మారింది. అలాగే ఓటర్లు ఆకర్షించేందుకు బీజేపీ కూడా తమ మేనిఫెస్టోలో పలు ఉచిత హామీలు ప్రకటించింది.
చీలిపోయిన ముస్లిం ఓట్లు
ఢిల్లీలో ముస్లి ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ఆసక్తిరరంగా ఫలితాలు వస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకంగా ముస్లింలు ఓటు వేస్తారని అనుకున్నారు. కానీ వీళ్ల నుంచి కూడా బీజేపీకే ఓట్లు పడ్డాయి. ఎన్నికల రోజు మౌలానా సాజిద్ రషీది తాను బీజేపీకి ఓటు వేసినట్లు బహిరంగంగానే ప్రకటన చేశారు. ముస్లింలను తనవైపు తిప్పుకోవడంలో ఆప్ విఫలమైంది. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు లేకపోవడం కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు చీలిపోయారు.
బడ్జెట్ ఎఫెక్ట్
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించింది. దీని ఎఫెక్ట్ కూడా ఈ ఎన్నికల్లో కనిపించినట్లు తెలుస్తోంది.
డబుల్ ఇంజిన్
ఈ మధ్య బీజేపీ ఏ ఎన్నికలు జరిగినా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల గురించి మట్లాడుతోంది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజిన్ అంశాన్ని ప్రస్తావించింది. కేంద్రంలో పాటు ఢిల్లీలో కూడా బీజేపీ ఉంటేనే అక్కడ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. డబుల్ ఇంజిన్ ప్రభావం కూడా ఇక్కడ కనిపించినట్లు స్పష్టమవుతోంది.
ఆప్ బలహీనత
లిక్కర్ స్కామ్ విషయంలో ఆప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. అలాగే లంచం ఆరోపణలు కూడా ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతిశాయి. ఢిల్లీ ఓటర్లలో ఇది ప్రతికూల భావనను చూపించింది. 2013 నుంచి 2024 వరకు ఆప్ అధికారంలో ఉంది. కాబట్టి ఈసారి బీజేకీ అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ఓటర్లు భావించినట్లు తెలుస్తోంది.
క్రమశిక్షణా వ్యవస్థ
బీజేపీ తమ పార్టీ కార్యకర్తల నుంచి బడా నేతల వరకు అందిరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లింది. బీజేపీ కార్యకర్తలు కూడా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ అమలు చేయకపోయిన హామీలను, బీజేపీ పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) సభ్యులు కూడా బీజేపీకి తమవంతు సహకారాన్ని అందించారు.
మనసు మార్చుకున్న ఓటర్లు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. జాతీయ సమస్యలు, దేశ భద్రత వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు ఢిల్లీలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ ప్రజలు ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను కోరుకున్నారు. కానీ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే కోరుకున్నారు.