బీహార్‌లో మరో ముగ్గురు కవితలు.. అక్కడా, ఇక్కడా ఓటమి తర్వాతే పరి‘వార్’!

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫామిలీలో కవిత సునామీ సృష్టిస్తే.. అటు బిహార్ రాజకీయాల్లో లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సంచలనంగా మారారు. ఇద్దరూ తండ్రి, సోదరుడిని కాదని వెళ్లిన వారే.. అది కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాతే ఈ రెండు కుటుంబాల్లో విభేదాలు బయటపడ్డాయి.

New Update
Lalu Prasad Yadav with daughters

రాజకీయాలతో కుటుంబాలు విడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫామిలీలో కవిత సునామీ సృష్టిస్తే.. అటు బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలనంగా మారారు. ఇద్దరూ తండ్రి, సోదరుడిని కాదని వెళ్లిన వారే.. అది కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాతే ఈ రెండు కుటుంబాల్లో విభేదాలు బయటపడ్డాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదనే కారణంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె కల్వకుంట్ల ఫ్యామిలీకి, అటు బీఆర్ఎస్ పార్టీకి విరోధిగా మారారు. 

బిహార్‌లో ఏం జరిగుతోంది..

రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు, కుటుంబ సంబంధాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు ప్రకటించింది. లాలూ మరో ముగ్గురు కూతుళ్లు కూడా ఇల్లు వదిలి ఆదివారం వెళ్లిపోయారు. కుటుంబంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య, సోదరి-సోదరుల మధ్య ఉన్న వైరుధ్యాలే ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది. మొత్తం తొమ్మిది మంది సంతానం ఉన్న లాలూ కుటుంబంలో, పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించబడిన తర్వాత ఈ విభేదాలు మరింత పెరిగాయి.

లాలూ యాదవ్‌కు కిడ్నీ దానం చేసి వార్తల్లో నిలిచిన రోహిణి ఆచార్య, ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈ కుటుంబ కలహాలను బయటపెట్టాయి. ఆమె తన సోదరుడు, ఆర్‌జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ సన్నిహిత సహాయకులపై, ముఖ్యంగా సంజయ్ యాదవ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను అవమానించారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొంటూ, ఆమె రాజకీయాలను వీడుతున్నట్లు ప్రకటించి, తన కుటుంబాన్ని కూడా వదిలి వెళ్తున్నట్లు చెప్పారు. 

తాజా పరిణామాలలో రోహిణి ఆచార్య బాటలోనే మరో ముగ్గురు కుమార్తెలు కూడా తమ తల్లి రబ్రీ దేవి నివాసాన్ని వీడి వెళ్లారు. తమ సోదరి రోహిణికి జరిగిన అవమానాల కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కుమార్తెలు తమ భర్తలతో కలిసి వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీలో తేజస్వి యాదవ్ ఏకఛత్రాధిపత్యం పెరగడం, సీనియర్ నాయకులను, కుటుంబ సభ్యులను పక్కన పెట్టడం వంటి కారణాల వల్లే ఈ కలహాలు పెరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై లాలూ ప్రసాద్ యాదవ్ లేదా రబ్రీ దేవి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కుటుంబ కలహాలు ఎంతవరకు ముదురుతాయో, దీని ప్రభావం బీహార్ రాజకీయాలపై ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు