/rtv/media/media_files/2025/10/13/lalu-prasad-ydav-2025-10-13-13-41-30.jpg)
Lalu prasad Ydav, Rabri and Tejashwi
Family Conflict : బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీ ఆర్‌జేడీలో ముసలం పుట్టింది. పార్టీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యర్థులకు పార్టీ టికెట్లు పంపిణీ చేయగా.. ఆయన చిన్న కుమారుడు, పార్టీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వాటిని వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. తండ్రీకొడుకుల నడుమ ఆధిపత్య పోరు సాగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విభేధాలు బహిర్గతం కావడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. లాలు, తేజస్వి నిర్ణయంతో విపక్షాల మహాగఠ్‌బంధన్(మహాకూటమి) కూడా షాకైంది. అధికార ఎన్‌డీఏ పక్షాలు పొత్తు ఖరారుచేసుకుని అభ్యర్థుల జాబితాలు కూడా విడుదల చేస్తుండగా.. విపక్షాల నడుమ ఇంకా సీట్ల సర్దుబాటు కాకపోవడం కలవర పెడుతోంది.
ఐఆర్‌సీటీసీ స్కాం కేసులో ఢిల్లీ కోర్టులో హాజరైన లాలూ, ఆయన భార్య రాబ్డీదేవి ఇటీవలె పట్నాలోని తమ నివాసానికి చేరుకున్నారు. తర్వాత టికెట్ ఆశావహులకు పార్టీ నాయకత్వం నుంచి ఫోన్లు వెళ్లాయి. వారంతా లాలూ నివాసానికి చేరుకుని ఆయన ఇచ్చిన బీఫారాలతో ఆనందంగా బయటకు వచ్చారు. వీరిలో ఇటీవల సీఎం నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ నుంచి ఆర్‌జేడీలోకి వచ్చిన సీనియర్ ఎమ్మెల్యేలు సునీల్‌సింగ్ (పర్బత్తా), నరేంద్రకుమార్‌సింగ్ అలియాస్ బోగో (మతిహానీ), ఆర్‌జేడీ సిటింగ్ సభ్యులు భాయ్ వీరేంద్ర, చంద్రశేఖర్ యాదవ్, ఇజ్రాయిల్ మన్సేరీ తదితరులు కూడా ఉన్నారు. ఈ లోపు తేజస్వి సైతం ఢిల్లీ కోర్టులో హాజరై కొద్ది గంటల తర్వాత పట్నా చేరుకున్నారు. తనకు తెలియకుండా తండ్రి లాలు టికెట్లు పంపిణీ చేయడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అదీగాక మిత్రులతో సీట్ల లెక్క తేలకుండా టికెట్ల పంపిణీ కరక్ట్ కాదని.. భాగస్వామ్య పక్షాలు సీరియ్‌స్‌గా తీసుకుంటాయని తండ్రికి నచ్చజెప్పారు. రాత్రి పొద్దుపోయాక చర్చించిన తర్వాత టికెట్లు దక్కిన నేతలందరికీ మళ్లీ ఫోన్లు చేసి పిలిపించారు. ‘సాంకేతిక కారణాల' పేరు చెప్పి వారందరి నుంచి తేజస్వి బీఫారాలు వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది.
గత ఎన్నికల్లో కూడా..
అయితే లాలు ఇలా చేయడం కొత్తకాదు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా లాలూ ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. 40 సీట్లకు గాను 23 చోట్ల ఆర్‌జేడీ అభ్యర్థులను ప్రకటించారు. గెలిచే సీట్లు కాకుండా ఓడిపోయేవి ఇచ్చారని మిత్రపక్షాలు ఇప్పటికీ లాలూను ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అలాగే వ్యవహరించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. వెంటనే తేజస్విపై ఒత్తిడి తెచ్చింది. 243 స్థానాలు గల అసెంబ్లీలో కాంగ్రెస్ 70-75 సీట్లు అడుగుతోంది. వీఐపీ 50 సీట్లతో పాటు ఉపముఖ్యమంత్రి పదవిని కోరుకుంటోంది. సీపీఐ, సీపీఎం 24 స్థానాలు కావాలంటున్నాయి. ఆర్‌జేడీ కనీసం 134 సీట్లలో పోటీచేయాలని భావిస్తోంది.
బీజేపీ తొలి జాబితా విడుదల
ఇదిలా ఉండగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మందితో బీజేపీ తన తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో పలు విశేషాలు ఉండటం గమనార్హం. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్పీకర్ నంద కిశోర్ యాదవ్‌కు సీటు ఇవ్వలేదు.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరికి సీటు దక్కింది. శాసన మండలి సభ్యుడు, ఆరోగ్య, న్యాయ శాఖ మంత్రి మంగళ్ పాండేను కూడా బరిలో దించారు. ఈ ముగ్గురూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినవారే.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..