/rtv/media/media_files/2025/09/18/trump-may-roll-back-additional-tariffs-2025-09-18-16-06-53.jpg)
భారత్‌పై అమెరికా మొదట 25 శాతం, తర్వాత అదనంగా మరో 25 శాతం ఎగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. నవంబర్ తర్వాత ట్రంప్ 25శాతం సుంకాలు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్న సుంకాల వివాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించిన అదనపు 25 శాతం సుంకం నవంబర్ 30 తర్వాత ఉండకపోవచ్చని ఆయన అన్నారు.
🚨 HUGE BREAKING
— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) September 18, 2025
The INDIA–USA tariff DISPUTE could be resolved within the next 8–10 weeks.
—Chief Economic Advisor “V. Anantha Nageswaran” pic.twitter.com/Il3lZaWOMy
కోల్‌కతాలోని మర్చెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సుంకాలపై 2 ప్రభుత్వాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని నాగేశ్వరన్ తెలిపారు. రాబోయే 10 వారాల్లో ఈ పెనల్ సుంకాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ప్రస్తుతం ఉన్న 25 శాతం పరస్పర సుంకాన్ని 10-15 శాతం తగ్గించేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్‌పై ఆగస్టులో అమెరికా అదనపు 25 శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, గత కొన్ని వారాలుగా పరిస్థితుల్లో సానుకూల మార్పులు వస్తున్నాయని, అందువల్ల ఈ అదనపు సుంకాలు త్వరలోనే రద్దు అవుతాయని నాగేశ్వరన్ నమ్మకం వ్యక్తం చేశారు.
అయితే, ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సుంకాల వివాదం పరిష్కారం కావడం వాణిజ్యానికి మాత్రమే కాకుండా, పెట్టుబడి నిర్మాణానికి కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సుంకాల కారణంగా భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి, ఈ వివాదం త్వరగా పరిష్కారం కావాలని ఇరు దేశాల వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతంగా ఉంటుందని నాగేశ్వరన్ అంచనా వేశారు. అలాగే, ప్రస్తుతం సంవత్సరానికి 850 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది దేశీయ వినియోగంపై ఆధారపడి ఉన్న ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా ఆయన పేర్కొన్నారు.