ఇండియా నేపాల్ సరిహద్దు మూసివేత.. టిక్‌టాక్‌ వీడియోతో బార్డర్‌లో హై టెన్షన్

నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ధనుషా జిల్లాలోని కమల మున్సిపాలిటీలో ఒక మసీదుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

New Update
nepal

నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ధనుషా జిల్లాలోని కమల మున్సిపాలిటీలో ఒక మసీదుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో భారత్-నేపాల్ సరిహద్దులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

టిక్‌టాక్‌లో మతపరమైన విద్వేషాలను రేకెత్తించేలా ఉన్న ఓ వీడియో ఈ గొడవలకు కారణమని తెలుస్తోంది. ఇద్దరు యువకులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోను అప్‌లోడ్ చేశారు. దీన్ని ఖండిస్తూ మరికొందరు వ్యక్తులు ధనుషా జిల్లాలోని సఖువా మరన్ ప్రాంతంలో ఉన్న మసీదుపై దాడి చేసి, మత గ్రంథాలను కాల్చివ వేశారు. మసీదుపై దాడికి నిరసనగా ముస్లిం కమ్యూనిటీ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టింది. ముఖ్యంగా భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బీర్‌గంజ్ నగరంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి.

పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కనీసం ఏడుగురు పోలీసులు గాయపడినట్లు సమాచారం. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు, అవాంఛనీయ శక్తులు సరిహద్దు దాటకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల వెంబడి SSB బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. బీర్‌గంజ్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నేపాల్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అత్యవసర సేవలకు తప్ప పౌరుల రాకపోకలపై పూర్తి నిషేధం విధించారు. టిక్‌టాక్ వీడియో పోస్ట్ చేసిన ఇద్దరితో పాటు, మసీదు దాడిలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ అధికారులు శాంతి చర్చలు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, మత సామరస్యాన్ని కాపాడాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల్లో సాధారణ స్థితి నెలకొనే వరకు భద్రతా ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు