Chief Election Commissioner: జ్ఞానేష్ కుమార్ ఫ్యామిలీపై ట్రోలింగ్.. ఎందుకంటే?

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంపై జరుగుతున్న 'ఆన్‌లైన్ ట్రోలింగ్'ని IAS అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష నాయకులు చేసిన 'ఓట్ల చోరీ' ఆరోపణలతో జ్ఞానేష్ కుమార్ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

New Update
Gyanesh Kumar family

Gyanesh Kumar family

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న 'ఆన్‌లైన్ ట్రోలింగ్'ను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు చేసిన 'ఓట్ల చోరీ' ఆరోపణల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ కుటుంబంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయమై ఐఏఎస్ అసోసియేషన్ శుక్రవారం Xలో ఓ పోస్ట్ చేసింది. "చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫ్యామిలీపై వ్యక్తిగత విమర్శలు వస్తున్నాయని IAS అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వారు కూడా మంచి పేరున్న సివిల్ సర్వెంట్లే. అధికారిక విధులకు సంబంధం లేని ఇలాంటి వ్యక్తిగత దాడులను ఐఏఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. మేము ప్రజా సేవలో గౌరవం, సమగ్రత కోసం నిలబడతాము" అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.

జ్ఞానేష్ కుమార్ ఫ్యామిలీ, ముఖ్యంగా ఆయన కుమార్తెలు, సోషల్ మీడియాలో కొంతమంది వినియోగదారుల ద్వారా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిహార్‌లోని 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని, తద్వారా బిజెపికి ప్రయోజనం చేకూర్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం, జ్ఞానేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తన ఆరోపణలు నిజమని అఫిడవిట్ సమర్పించాలని లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "అఫిడవిట్ ఇవ్వాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి, మూడో ఆప్షన్ లేదు. ఏడు రోజుల్లో అఫిడవిట్ రాకపోతే, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని అర్థం" అని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఒక లోక్‌సభ ఎన్నికల్లో కోటి మందికి పైగా అధికారులు, 10 లక్షలకు పైగా బూత్ స్థాయి ఏజెంట్లు, 20 లక్షలకు పైగా పోలింగ్ ఏజెంట్లు పని చేస్తారని, ఇంత మంది ముందు, ఇంత పారదర్శకమైన ప్రక్రియలో ఓట్లు దొంగిలించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కొన్ని చోట్ల డబుల్ ఓటింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చినా, వాటికి ఆధారాలు కోరితే ఏమీ లభించలేదని ఆయన తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని కానీ, ఓటర్లను కానీ భయపెట్టలేవని జ్ఞానేష్ కుమార్ నొక్కి చెప్పారు.

Advertisment
తాజా కథనాలు