సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ చెపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 18 మంది కీలక సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లందరిపై కూడా తెలంగాణలో 45కు పైగా కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Also read: ఆపరేషన్ భేడియా సక్సెస్.. ఆరో తోడేలును మట్టుబెట్టిన గ్రామస్థులు
దేశంలో సెక్స్ టార్షన్, కొరియర్ పెట్టుబడి పేర్లతో వీళ్లు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇక తెలంగాణలో నమోదైన కేసుల్లో.. బాధితుల నుంచి ఈ దుండగులు ఏకంగా రూ.6.94 కోట్లు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజలను మభ్యపెట్టి, తప్పులు లింకులు పంపించి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును స్వాహా చేస్తున్నారు. ప్రతిరోజూ సైబర్ క్రైం కేసులు ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఏ లింకులు పడితే వాటిని క్లిక్ చేయొద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.