/rtv/media/media_files/2026/02/05/karnataka-2026-02-05-17-01-43.jpg)
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఒక విచారకరమైన ఘటన జరిగింది. ఇన్నేళ్లుగా కలిసి మెలిసి ఉన్న ఇరుగుపొరుగు వారి మధ్య ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడిపై దాడికి దారితీసింది.
వెంకటేష్ అనే యువకుడికి, అజీర్ అనే ముస్లిం వ్యక్తికి గత 15 ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. వీరు ఒకే ఊరిలో పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు. అయితే, అజీర్ తన భార్య అఫియాతో గొడవ పడటంతో, ఆమె కోపంతో పిల్లలను తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోవడానికి బస్టాండ్‌కు వెళ్లింది. కంగారుపడ్డ అజీర్.. తన స్నేహితుడు వెంకటేష్‌ను పిలిచి, "నువ్వైనా వెళ్లి ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకురా" అని బతిమిలాడాడు.
స్నేహితుడి మాట ప్రకారం వెంకటేష్ బస్టాండ్‌కు వెళ్లి, అఫియాతో మాట్లాడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన కొంతమంది ముస్లిం యువకులు.. వెంకటేష్ మరొకరి భార్యతో ఉన్నాడని తప్పుగా అర్థం చేసుకున్నారు. వెంకటేష్ ఎంతగా బతిమిలాడినా వినకుండా అతనిపై మూకదాడి చేశారు. "మేము ఒకే గ్రామం వాళ్లం, ఆమె మాకు తెలిసిన ఆవిడ" అని చెప్పినా వదలకుండా కొట్టారు. అతని ఫోన్, డబ్బులు కూడా లాక్కున్నారని తెలిసింది.
సోషల్ మీడియాలో కలకలం
ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆ వీడియోలో వెంకటేష్ తనను వదిలేయమని ప్రాధేయపడుతుండటం కనిపిస్తుంది. ఈ ఘటనతో ఊరిలో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకవైపు వెంకటేష్‌కు న్యాయం చేయాలని స్థానికులు గొడవ చేస్తుంటే, మరోవైపు దాడి చేసిన వారి మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు.
వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ దాడికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. "నిందితులు కేవలం అనుమానంతోనే దాడి చేశారు, అసలు అక్కడ తప్పేమీ జరగలేదు" అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గొడవలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow Us