Maoist Letter: హిడ్మాది భూటకపు ఎన్‌కౌంటర్‌...మావోయిస్టు పార్టీ కీలక లేఖ

మావోయిస్టు  పార్టీ కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ఆ పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది.  హిడ్మాది ముమ్మాటికి భూటకపు ఎన్‌కౌంటరే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) వికల్ప్ పేరిట లేఖను విడుదల చేసింది.

New Update
FotoJet - 2025-12-04T123949.520

Maoist Party's key letter..hidma encounter

Maoist Letter : మావోయిస్టు  పార్టీ కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఆ పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది.  హిడ్మాది ముమ్మాటికి భూటకపు ఎన్‌కౌంటరే అని తేల్చి చెప్పింది. ఇటీవల మారెడుమిల్లి, రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్లపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) వికల్ప్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లనే వీళ్ళు దొరికిపోయారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లినట్లు చెప్పారు. అయితే, ఆ లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, మరో ఐదుగురు, ఏవోబీ ఎస్‌జడ్‌సీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌లవి ముమ్మాటికీ హత్యలేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులవి పక్కా బూటకపు ఎన్‌కౌంటర్లని, మా వాళ్లను నిరాయుధులుగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చారని ఫైర్ అయ్యారు.
 
లేఖ ప్రకారం..కామ్రేడ్ హిడ్మా నవంబర్ 15న చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి, మూడు రోజుల చిత్రహింసలు పెట్టారని వికల్ప్‌  ఆరోపించారు. అనంతరం నవంబర్ 18న ఆయనను, అనుచరులను ఎవరి కంటా పడకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చారని ధ్వజమెత్తారు. అదేవిధంగా నవంబర్ 19న రంపచోడవరం మండలంలో కామ్రేడ్ శంకర్‌తో సహా మరో 6 గురిని హతమార్చారన్నారు. మొత్తం 13 మంది మావోయిస్టులను హతమార్చడంతో పాటు 50 మందిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. అయితే, అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి లేరని తేల్చి చెప్పారు. హిడ్మా కదలికలను ఇది వరకే సరెండర్ అయిన పార్టీ సభ్యుడు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని లేఖలో ప్రస్తావించారు. అనంతరం విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ కాంట్రాక్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ ఆపరేషన్ అని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూత్రధారి అని ఆరోపించారు.
 
బస్తర్‌లో ఆదివాసులపై నరసంహారం జరుగుతోందని, ఇటీవలి ఘటనల్లో పలువురు గ్రామస్థులు కూడా హతమయ్యారని పేర్కొన్నారు. ఆ హత్యలపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ‘ఆపరేషన్ కగార్‌’‌ను వెంటనే ఆపాలని.. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులకు న్యాయ సాయం అందించాలని, వారి విడుదలకు కృషి చేయాలని ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అబద్ధ ప్రచారాలకు లొంగకుండా విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖలో పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు