infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
infosys

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణంలో నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బెంగళూరు శివార్లలోని అనేకల్ తాలూకా, అత్తిబేలె హోబ్లీలో ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన 53.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పురవంకరకు సుమారు రూ.250 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది.

కావేరీ 2.0 సాఫ్ట్‌వేర్‌లోని లొసుగులను వాడుకుని, అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆధారాలు లభించాయి. ముఖ్యంగా 'ఈ-ఖాతా' వివరాలు లేకుండానే  కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తప్పుడు సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారిలో రవి శంకనగౌడ ఒక్కరే ఇన్ఫోసిస్ భూమికి సంబంధించి దాదాపు 40 సేల్ డీడ్లను అక్రమంగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.

రాజకీయ రచ్చ

ఈ వ్యవహారంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ప్రభుత్వం రాయితీ ధరపై కేటాయించిన భూమిని, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య లాభాల కోసం విక్రయించడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, ఇన్ఫోసిస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఆ భూమిని తాము ప్రైవేట్ వ్యక్తుల నుండి బహిరంగ మార్కెట్లోనే కొనుగోలు చేశామని, ప్రభుత్వ రాయితీతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం ఈ ఒక్క భూమికే పరిమితం కాకుండా, బెంగళూరు వ్యాప్తంగా జరిగిన సుమారు 1,332 అక్రమ రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు