/rtv/media/media_files/2025/09/09/vice-presidential-elections-2025-09-09-07-24-44.jpg)
Vice Presidential Elections
Vice President: దేశంలో ఈ రోజు అత్యంత కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అయితే అన్ని రకాల ఎన్నికల్లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లు ఉపయోగించడం చాలాకాలంగా వస్తున్నదే. కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వీటిని ఉపయోగించరు. దీనికి ప్రధాన కారణం వాటిని ఓటు అగ్రిగేటర్లుగా రూపొందించడమే. గడచిన రెండున్నర దశాబ్ధాలుగా దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లు ఉపయోగించే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఈవీఎం లను లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఉపయోగించేందుకు వీలుగా అంటే Vote Aggregator గా మాత్రమే వీటిని రూపొందించడంతో వాటిని ప్రెసిడెంట్ ఎన్నికకు వినియోగించే అవకాశం లేదు. సాధారణ ఎన్నికల్లో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్‌ను ఓటరు నొక్కుతారు. తద్వారా ఆయా అభ్యర్థులకు పోలైన ఓట్లను మాత్రమే అక్కడ చూపిస్తుంది. అలా ఎక్కువ ఓట్లను పొందిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం జరుగుతుంది.
సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటింగు పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ విధానాన్ని అనుచరించడం ఆనావాయితీ. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు తమ ప్రాధాన్యం తెలిపే అంకె అంటే (1, 2..) వేయాలి. అంకెలు మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాయకూడదు. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యనుబట్టి ఓటర్లు తమకు నచ్చినంత వరకు ప్రాధాన్య అంకెలను బ్యాలెట్‌పై రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక వారు వేసే ఓటు చెల్లుబాటు కావాలంటే తప్పని సరిగా మొదటి ప్రాధాన్య అంకె వేయాలి. మిగతా ప్రాధాన్య అంకెలు అభ్యర్థులు నచ్చితే వేయొచ్చు.. లేదంటే వదిలేయచ్చు. దీనికోసం ఎన్నికల సంఘం ఓటర్లకు ప్రత్యేక పెన్నులు అందిస్తుంది. ఆ పెన్నుతోనే ఓటర్లు మార్కింగు చేయాలి. లేదు తమ వద్ద ఉన్న వాడుతాం అంటే కుదరదు. అలా చేస్తే ఆ ఓటును చెల్లుబాటు కాదు.దామాషా ప్రాతినిధ్య విధానంలో జరిగే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఆధారంగా ఓట్లను లెక్కిస్తారు. అలా చేయాలంటే భిన్న సాంకేతికతతో కూడిన ఈవీఎంలు అవసరం. ప్రస్తుతం మనవద్ద ఉన్న ఈవీఎంలు కేవలం ఓట్ల అగ్రిగేటర్లుగా పనిచేస్తాయి. అందుకే వీటిని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాడే అవకాశం లేదని ఈసీ స్పష్టం చేస్తోంది.
ఈవీఎం చరిత్ర...
ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం 1977లో తొలిసారి ఈవీఎం రూపకల్పనకు ప్రయత్నాలు జరిగాయి. తొలిసారి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్... దీని రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలు తీసుకుంది. 1979లో తొలిసారి ఓ నమూనా తయారు చేయగా.. 1980లో అన్ని రాజకీయ పార్టీల ముందు దీని పనితీరును ప్రదర్శించింది. అన్ని పార్టీలు అంగీకరించడంతో 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి వీటిని ఉపయోగించారు. కానీ, దీనికి సంబంధించి చట్టంలో స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది. దీనికోసం 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి.. ఎన్నికల్లో ఈవీఎంల వాడేందుకు అనువైన నిబంధనలు రూపొందించారు. ఈవీఎంలు ప్రవేశపెట్టడంపై 1998లో ఏకాభిప్రాయం కుదిరింది. అలా పలు రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఉపయోగించారు. ఆ తర్వాత 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఉపయోగించారు. అప్పటినుంచి అన్ని రకాల ఎన్నికల్లో ఈసీ వీటినే వినియోగిస్తూ వస్తున్నది.
ఇది కూడా చూడండి: Indiramma's houses : ఇందిరమ్మ ఇండ్లకు గుడ్ న్యూస్.. వాటికి అదనపు నిధులు