Indiramma's houses : ఇందిరమ్మ ఇండ్లకు గుడ్‌ న్యూస్‌.. వాటికి అదనపు నిధులు

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌కు  కేంద్రం నుంచి అదనంగా నిధులు రానున్నాయి.  ప్రస్తుతం రూరల్‌‌లో ఒక్కో ఇంటి నిర్మాణానికి పీఎం ఆవాస్ యోజన కింద రూ. 72 వేలు ఇస్తున్నారు..అయితే ఇపుడు  దీనికి అదనంగా ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ ఫండ్స్ కూడా రానున్నాయి.

New Update
Indiramma Houses

Indiramma Houses

Indiramma's houses :  ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌కు  కేంద్రం నుంచి అదనంగా నిధులు రానున్నాయి.  ప్రస్తుతం రూరల్‌‌లో ఒక్కో ఇంటి నిర్మాణానికి పీఎం ఆవాస్ యోజన కింద రూ. 72 వేలు ఇస్తున్నారు..అయితే ఇపుడు  దీనికి అదనంగా ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ ఫండ్స్ కూడా రానున్నాయి. ఇందిరమ్మ స్కీమ్‌‌కు ఈ రెండు పథకాలను అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్ ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేశారు.  దీని ప్రకారం కేంద్రం నుంచి ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కింద రూ. 27 వేలు, స్వచ్చ భారత్ మిషన్​(ఎస్‌‌బీఎం)  కింద రూ.12 వేలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతాయి. ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుడికి  ఉపాధి హామీ కార్డు ఉంటే, ఇంటి పని కింద  90 రోజులు  పనిచేసినందుకు కూలీ కింద రోజుకు రూ.300 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే అవకాశం ఉంది. వీటితో పాటు ఎస్‌‌బీఎంలో టాయిలెట్స్ నిర్మాణంతోపాటు ఇతర పారిశుద్ధ్య పనులకు మరో రూ.12 వేలు కేంద్రం ఇవ్వనుంది.

కాగా రాష్ట్రానికి ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేశారు. ఇందులో 2 లక్షల మందికి మాత్రమే ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. దీంతో మిగతా లక్ష మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖకు హౌసింగ్ అధికారులు ఇటీవల లేఖ రాశారు.  తొలి దశలో పేదవాళ్లకు మాత్రమే ఇల్లు మంజూరు చేశారు. అలా ప్రతి లబ్ధిదారుడు ఉపాధి కార్డుకు అర్హులు అయ్యారు అని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు రూరల్‌‌‌‌లో  ఒక్కో ఇంటికి పీఎం అవాస్ స్కీమ్ కింద రూ. 72 వేలు ఇస్తున్నారు. అయితే.. ఇపుడు రూ. 39 వేలు అదనంగా రానున్నాయి. దీంతో కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి రూ. 1.11 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. మిగతా రూ.3.89 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.   

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో పీఎం అవాస్ స్కీమ్ కింద  ఆయా రాష్ర్టాలకు ఇండ్లను మంజూరు చేస్తుంది. నిరుడు సర్వే  స్టార్ట్ కాకపోవడంతో రూరల్ లో ఇండ్లు మంజూరు చేయలేదు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇండ్లు లేని వారి నుంచి ప్రజా పాలనలో దరఖాస్తులు తీసుకున్నది. వీరిలో సుమారు 65 లక్షల మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. అయితే, ఈ లెక్కలను కేంద్రం అంగీకరించలేదు. వివరాలను కేంద్ర యాప్‌‌‌‌లో సర్వే చేసి పంపాలని ఆదేశించింది. 

తొలి దశలో సుమారు 16 లక్షల మంది సొంత జాగా ఉండి.. ఇండ్లు లేని వారిని గుర్తించారు. . వారిలో ఇప్పటి వరకూ కేంద్ర యాప్ ప్రకారం 5 లక్షల మంది సర్వే పూర్తి చేసినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయిన అప్లికేషన్లను పరిశీలించి ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అయితే కేంద్రం మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. సర్వే మొత్తం పూర్తయ్యాకే ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.  దీంతో వచ్చే నెలలో  రూరల్‌‌‌‌లో ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలుస్తున్నది.


కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 2 దశల్లో 3 లక్షల 18 వేల  ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో  2 లక్షల ఇండ్ల పనులు మొదలయ్యాయి. ఇందులో లక్ష వరకు బేస్‌‌‌‌మెంట్ సైతం పూర్తి కాగా,  6 వేల ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తికాగా వాటిని  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 

కాగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను ఆలస్యం చేయకుండా  జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులతో  వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.  దీంతో అన్ని జిల్లాల్లో మంత్రులు ఇండ్లను ప్రారంభిస్తున్నారు. వర్షాలు  తగ్గుముఖం పట్టడంతో ఈ నెల నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వేగంగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఇందుకు లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఫండ్స్‌‌‌‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు నిధులు బదిలీ చేయాలని ఆదేశించారు.అక్రమాలకు అవకాశం లేకుండా ఇందిరమ్మ యాప్ డౌన్ లోడ్ చేసుకొని నేరుగా లబ్ధిదారుడే  ఇంటి ఫోటో తీసి.. అప్‌‌‌‌లోడ్ చేసే సదుపాయాన్ని కూడ అధికారులు కల్పించారు. అలాగే, ఆధార్, బ్యాంక్ ఖాతాలో పేర్లు తప్పుగా ఉన్నా,  ఇంటి పేర్లలో తప్పులు ఉన్నా సరి చేసుకునే అవకాశం, ఆధార్‌‌‌‌‌‌‌‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వ సాయం బదిలీ చేయడం,  ఆన్ లైన్‌‌‌‌లో ప్రభుత్వ సాయం స్టేజ్ తెలుసుకునే విధంగా అధికారులు యాప్ లో మార్పు చేర్పులు చేశారు.

Also Read: ఎంపీ సోదరికి అత్తింటివారి వేధింపులు.. నడిరోడ్డుపై కర్రతో కొట్టిన మామ.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు