జమ్మూకశ్మీర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వేదికపై ఉన్న నేతలు, సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని గమనించి చేతులు పట్టుకున్నారు. తన పరిస్థతి బాలేనప్పటికీ కూడా ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రహోదా పునరుద్ధరించేందుకు తాము పోరాడతామన్నారు. ఇప్పుడు నాకు 83 ఏళ్లని.. అంత త్వరగా చనిపోనని అన్నారు. ప్రధాని మోదీనికి అధికారం నుంచి గద్దె దింపేవరకు బతికే ఉంటానని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని కతువాలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కోరుకోలేదని ఆరోపించారు. వాళ్లు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాకే ఎన్నికలు సిద్ధమయ్యారన్నారు. వాళ్లకు ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదని.. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే ప్రభుత్వాన్ని నడిపించాలని కోరుకున్నారని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ భారతీయ యువతకు ఏం ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇదిలాఉండగా.. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దయ్యాకా జమ్మూకశ్మీర్‌లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దశల వారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశ పోలింగ్‌కు ఆదివారమే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. అక్టోబర్ 3న ఈ తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read : రీల్ లైఫ్ హీరోలు..రియల్ లైఫ్ విలన్లు.. బయటపడుతున్న సెలెబ్రెటీల భాగోతాలు!