/rtv/media/media_files/2026/01/10/chinese-woman-2026-01-10-14-33-38.jpg)
భారత్-నేపాల్ సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ చైనా మహిళని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ఆమె అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఉన్న ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలినడకన సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తూ SSB సిబ్బందికి కనిపించింది. ఆమె ప్రవర్తనపై డౌట్ వచ్చి భద్రతా దళాలు ఆమెని ఆపి ప్రశ్నించారు. చెక్ చేయగా ఆమె దగ్గర ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్ లేవని తేలింది.
దీనితో భద్రతా దళాలు ఆమెను వెంటనే అదుపులోకి తీసుకుని, స్థానిక నౌతన్వా పోలీసులకు అప్పగించాయి. ఆమె దగ్గరున్న ఓ చిన్న స్లిప్ ఆధారంగా ఆమె చైనాకు చెందిన హువాజియా జీగా పోలీసులు గుర్తించారు.
ఈ అరెస్టుపై నౌతన్వా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురుషోత్తం రావు మాట్లాడుతూ.. సదరు మహిళ చైనాలోని ఏ నగరానికి చెందినది, అసలు భారత్‌కు ఎందుకు రావాలనుకుంది అనే అంశాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అయితే, ఆ మహిళకు హిందీ లేదా ఇంగ్లీష్ రాకపోవడంతో విచారణలో కొంత ఇబ్బంది ఎదురవుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆమె మాట్లాడే భాషను అర్థం చేసుకునేందుకు ట్రాన్స్‌లేటర్ల హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది.
నేపాల్ సరిహద్దు ద్వారా చైనా జాతీయులు అక్రమంగా ప్రవేశించడం ఇటీవల కాలంలో భద్రతా సంస్థలకు సవాలుగా మారింది. నిందితురాలు గూఢచర్యం కోసం వచ్చిందా లేక మరేదైనా కారణంతో వచ్చిందా అనే కోణంలో కేంద్ర నిఘా సంస్థలు కూడా ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం ఆమెపై ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా బౌద్ధ సన్యాసి వేషంలో లేదా నకిలీ పత్రాలతో చైనా గూఢచారులు దేశంలోకి రావడానికి ప్రయత్నించిన సంఘటనలు ఉండటంతో, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Follow Us