/rtv/media/media_files/2025/09/26/mukhyamantri-mahila-rozgar-yojana-2025-09-26-13-31-16.jpg)
బీహార్ రాష్ట్రంలో మహిళా సాధికారతపెంచే లక్ష్యంతో ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజన'ని ప్రవేశపెట్టారు.ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సెప్టెంబర్ 26న) వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా రూ.10,000 చొప్పున తొలి విడత ఆర్థిక సాయాన్ని బదిలీ చేయనున్నారు. ఈ విధంగా మొత్తం రూ. 7,500 కోట్లను మహిళలకు నేరుగా పంపిణీ చేయనున్నారు.
పథకం లక్ష్యాలు:
ఈ పథకం బీహార్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళ స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో, ఎంపికైన ప్రతి లబ్ధిదారురాలికి తమకు నచ్చిన ఉపాధిని ప్రారంభించడానికి రూ.10,000 ఆర్థిక సాయం (గ్రాంట్ రూపంలో) అందించబడుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత వారి బిజినెస్ రన్నింగ్‌ని రూ. 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంటుంది.
వ్యవసాయం, పశుపోషణ, హస్తకళలు, కుట్టుపని, నేత వంటి అనేక చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఈ సహాయం ఉపయోగపడుతుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. స్వయం సహాయక బృందాలకు అనుసంధానమైన కమ్యూనిటీ వనరుల వ్యక్తులు మహిళలకు శిక్షణ, మార్గదర్శకాలను అందిస్తారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల, ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన మహిళలు, ముఖ్యంగా స్థిర ఆదాయ వనరు లేనివారు ఈ పథకానికి అర్హులు. జీవికా స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.