మెడికల్ సీటు కోసం అభ్యర్థి ప్లాన్.. కాళ్లు నరుక్కొని రిజర్వేషన్ కోసం కట్టుకథ

మెడికల్ సీటు సాధించాలనే పిచ్చి ఓ యువకుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. డాక్టర్ కావాలనే కోరిక కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సింది పోయి, అడ్డదారిలో సీటు సంపాదించాలనుకున్నాడు. ఏకంగా తన కాలునే నరుక్కున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

New Update
rajasthan student

మెడికల్ సీటు సాధించాలనే పిచ్చి ఓ యువకుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. డాక్టర్ కావాలనే కోరిక కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సింది పోయి, అడ్డదారిలో సీటు సంపాదించాలనుకున్నాడు. ఏకంగా తన కాలునే నరుక్కున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా ఖలీల్‌పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ (20) అనే యువకుడు గత రెండేళ్లుగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. వరుసగా రెండుసార్లు పరీక్ష రాసినా సీటు దక్కలేదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన సూరజ్, ఎలాగైనా 2026 నాటికి డాక్టర్ కావాలని తన డైరీలో రాసుకున్నాడు. జనరల్ కేటగిరీలో సీటు రావడం కష్టమని భావించి, దివ్యాంగుల కోటాలో అయితే తక్కువ మార్కులకు సీటు వస్తుందని ఒక భయంకరమైన పథకం వేశాడు.

కాలు నరుక్కుని.. కట్టుకథ అల్లి 

ప్లాన్ ప్రకారం.. సూరజ్ తన పాదాన్ని తానే స్వయంగా నరుక్కున్నాడు. ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేసి కాలు నరికేశారని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆదివారం రక్తం మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఎవరో దుండగులు దాడి చేశారని సూరజ్ బుకాయించాడు.

జౌన్‌పూర్ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. సూరజ్ చెబుతున్న మాటలకు, ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలకు ఎక్కడా పొంతన కుదరలేదు. అతడి డైరీని చూడగా 2026లో నేను డాక్టర్‌ను అవుతాని స్ట్రాంగ్‌గా రాసుకున్నాడు. అలాగే ఫోన్ సెర్చ్ హిస్టరీలో దివ్యాంగుల కోటా నిబంధనల గురించి వెతికినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో సూరజ్ అసలు విషయం ఒప్పుకున్నాడు. దివ్యాంగుల కోటాలో సీటు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పడంతో పోలీసులు, డాక్టర్లు సైతం షాక్‌కు గురయ్యారు.

ప్రస్తుతం సూరజ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతడిపై కేసు నమోదు చేసే దిశగా అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఎంబీబీఎస్ కల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. 

Advertisment
తాజా కథనాలు