కేంద్రం గుడ్‌న్యూస్: నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ అమోదం

దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) నాలుగు కీలకమైన మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

New Update
Cabinet approves railway projects

దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) నాలుగు కీలకమైన మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు రూ.24,634 కోట్లు. ఈ భారీ పెట్టుబడితో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యం పెరగనుంది.

మొత్తం 894 కిలోమీటర్ల మేర విస్తరించనున్న ఈ నాలుగు ప్రాజెక్టుల వివరాలు..
వర్ధా – భూసావాల్: 3వ, 4వ లైన్ (మహారాష్ట్ర) - 314 కి.మీ.
గోండియా – డొంగార్‌గఢ్: 4వ లైన్ (మహారాష్ట్ర & ఛత్తీస్‌గఢ్) - 84 కి.మీ.
వడోదర – రాత్లాం: 3వ, 4వ లైన్ (గుజరాత్ & మధ్యప్రదేశ్) - 259 కి.మీ.
ఇటార్సీ – భోపాల్ – బీనా: 4వ లైన్ (మధ్యప్రదేశ్) - 237 కి.మీ.

ఈ కొత్త లైన్ల నిర్మాణంతో రైల్వే నెట్‌వర్క్‌పై రద్దీ తగ్గి, ప్రయాణికుల, సరుకు రవాణా వేగం, సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్టులు బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, ఉక్కు వంటి ఉత్పత్తుల రవాణాకు అత్యంత కీలకమైన మార్గాలు. ఈ లైన్ల విస్తరణ ద్వారా ఏటా అదనంగా 78 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని అంచనా. అలాగే, 'పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్' కు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. పర్యావరణ అనుకూలమైన రైల్వే రవాణా ద్వారా ఇంధన దిగుమతులు తగ్గి, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని రైల్వే శాఖ తెలిపింది. మొత్తం మీద ఈ అభివృద్ధి పనులు ఆయా రాష్ట్రాల ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ, ఆర్థిక ప్రయోజనాలను అందించనున్నాయి.

Advertisment
తాజా కథనాలు