/rtv/media/media_files/2026/01/21/budget-2026-01-21-11-32-45.jpg)
Union Budget 2026
Budget 2026: వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఉంటాయి..కానీ చేతిలో ఒక్క పైసా కనిపించదు. ఇదీ భారతదేశంలో మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి. దీనికి కారణం అన్ని ధరలూ విపరీతంగా పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం. కానీ మధ్య తరగతి వాళ్ళ జీతాలు మాత్రం పెద్దగా పెరగడం లేదు. ఒకవేళ పెరిగినా అవి పేపర్ మీద మాత్రమే కనిపిస్తాయి. ట్యాక్స్ లు పోయి చేతికి వచ్చేది మాత్రం ఎప్పటిలా బెత్తెడే ఉంటుంది. క్రితంసారి బడ్జెట్ లో ట్యాక్స్ స్లాబ్ లను కొద్దిగా మార్చారు. కానీ అది కంటి తుడుపు చర్యగానే మిగిలిపోయింది. దీంతో ఈ సారి బడ్జెట్ లో 30 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ను సవరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దీనిపై సామాన్యుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
అసలు సమస్యేంటి?
ప్రస్తుతం ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం..ఆదాయం ఒక పరిమితి దాటితే 30 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. జీతం పెరిగినా టాప్ ట్యాక్స్ బ్రాకెట్ లోకి వెళ్ళిపోతోంది. కానీ కొనుగోలు శక్తి మాత్రం పెరగడం లేదు. ఇది మారాలంటే.. ప్రస్తుతం రూ. 24 లక్షల పైన ఉన్న 30 శాతం స్లాబ్ ను కనీసం రూ. 35 లక్షల వరకు పెంచాలి. అప్పుడే మధ్యతరగతి ప్రజల చేతిలో తగినంత డబ్బు మిగులుతుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. మనం కొనే వస్తువుల ధరలు ప్రతి ఏటా పెరుగుతుంటాయి. కానీ, మన ట్యాక్స్ ఫ్రీ లిమిట్ మాత్రం అలాగే ఉంటుంది. దీనినే బ్రాకెట్ క్రీప్ అంటారు. అంటే ధరలు పెరిగినా..జీతం పెరగదు, రియల్ ఆదాయమూ పెరగదు. అందుకే ట్యాక్స్ స్లాబ్‌లను 'కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తో లింక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ధరలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ట్యాక్స్ లిమిట్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందని చెబుతున్నారు.
ట్యాక్స్ స్లాబ్ లో మార్పు ప్రభుత్వానికి లాభమా, నష్టమా?
ట్యాక్స్ స్లాబ్ లు మార్చడం వలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కొంత తగ్గవచ్చును కానీ మరో రూపంలో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది. దీని వలన జీఎస్టీ పెరుగుతుంది. ప్రజలు కార్లు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు కొంటే ప్రభుత్వం పరోక్ష పన్నుల రూపంలో లాభపడుతుంది. మధ్యతరగతి ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇన్వెస్ట్‌మెంట్లలో డబ్బు పెడతారు. ఇది దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. అన్నింటి కంటే ముఖ్యం పన్నులు తగ్గితే...ప్రజలు దానిని ఎగగొట్టకుండా నిజాయితీగా చెల్లిస్తారు.
ట్యాక్స్ స్లాబ్ లు పెంచడం వలన ఉద్యోగులు ఎక్కువగా లాభపడతారు. టీడీఎస్ రూపంలో కట్ అయ్యే డబ్బు తగ్గి, నెలకు చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ లాభాల్లో మూడో వంతు పన్నుకే ఇవ్వకుండా.. ఆ డబ్బును తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టవచ్చు. రిటైర్ అయిన వారికి పెరిగే వైద్య ఖర్చుల దృష్ట్యా, ట్యాక్స్ మినహాయింపులు చాలా అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే స్లాబ్ లను పెంచాలని జన కోరుతున్నారు. దాంతో పాటూ హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే మినహాయింపు (Section 24b) పరిమితిని కూడా పెంచాలని అడుగుతున్నారు.
Follow Us