BJP: ఆ వ్యూహమే బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపిస్తోందా ?

హర్యానాలో ఎన్నికలకు ముందు సీఎంను మార్చిన బీజేపీ.. హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు గుజరాత్, ఉత్తరాఖండ్, త్రిపుర, కర్ణాటకలో కూడా ఎన్నికలకు ముందు సీఎంలను మార్చింది.కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని రాష్టాల్లో కూడా బీజేపీ వ్యూహం ఫలించింది.

New Update
Amit shah and Modi

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల బీజేపీ గెలిచిన సంగతి తెలసింది. హర్యానాలో ఏ పార్టీ సాధించలేని హ్యాట్రిక్ విక్టరీని కమలం పార్టీ దక్కించుకుంది. 2014, 2019 కంటే ఈసారి బీజేపీ 48 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవశం చేసుకుంది. ఎన్నికలకు ముందు బీజేపీపై వ్యతిరేకత రావడంతో దీన్ని ముందుగానే గ్రహించిన బీజేపీ.. ఈ ఏడాది మార్చిలో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్‌ను తొలగించి.. నాయబ్ సింగ్ సైనీని సీఎం చేసింది. ఇలా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రును మార్చే బీజేపీ వ్యూహం ఫలిస్తూ వస్తోంది.

2021 నుంచి పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు బీజేపీ ముఖ్యంత్రులను మార్చేసింది. ఇలా చేయడం వల్ల బీజేపీపై అధికార వ్యతిరేకత తగ్గించేందుకు ఈ వ్యూహం దోహదపడింది. ఇప్పటికి వరకు హర్యానాతో కలిపి ఐదు రాష్ట్రాల్లో ఇలా ఎన్నికలకు ముందు సీఎంలను మార్చింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగా కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే అధికారాన్ని కోల్పోయింది. మొత్తానికి ఇలా ముఖ్యమంత్రులను చాకచక్యంగా మార్చే వ్యూహంలో బీజేపీకి ప్రయోజనం చేకూరుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ఏఏ రాష్ట్రాల్లో బీజేపీ ఈ ప్లాన్‌ను అమలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

గుజరాత్ 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రెండుసార్లు సీఎంను మార్చింది. రెండుసార్లు కూడా ప్రయోజనం పొందింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం ఆనందీబెన్‌ పటేన్‌ను తొలగించి ఆ పదవిని విజయ్‌ రూపానీకి అప్పగించింది. 2017 ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 99 స్థానాలను బీజేపీ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2022 ఎన్నికలకు ముందు 2021 సెప్టెంబర్‌లో సీఎం విజయ్‌ రూపానీని తొలగించి.. భూపేంద్ర సింగ్ పటేల్‌కు ఈ బాధ్యతను కట్టబెట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 156 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారం పీఠం దక్కించుకుంది.   

ఉత్తరాఖండ్

2022 అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు త్రివేంద్ర సింగ్‌ రావత్‌ను తొలగించి తీరత్ సింగ్ రావత్‌కు సీఎం బాధ్యతలు అప్పగించింది. అయితే తిరత్ సింగ్ కనీసం నాలుగు నెలలు కూడా ఆ పదవిలో ఉండకపోవడంతో పుష్కర్ సింగ్ ధామిని ముఖ్యమంత్రిగా చేసింది. ఇక 2022 ఉత్తరఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ గెలిచింది.   

త్రిపుర

త్రిపురలో 2023 మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే బీజేపీ.. బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ను తొలగించి, మాణిక్‌ సాహాను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకు 32 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది.  

కర్ణాటక 

కర్ణాటక ఎన్నికల్లో మాత్రం సీఎంను మార్చిన వ్యూహం ఫలించలేదు. 2021 జులైలో.. బీజేపీ అప్పటి సీఎం యడియూరప్పను తొలగించి బసవరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వల్ల బీజేపీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో 224 సీట్లకు గాను బీజేపీ కేవలం 66 సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 135 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా అక్కడి స్థానిక సమస్యలే బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. 

హర్యానా


ఇక హర్యానాలో ఈ ఏడాది మార్చిలో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్‌ను తొలగించి.. నాయబ్ సింగ్ సైనీని సీఎం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ బీజేపీ వ్యూహం ఫలించింది. హర్యానాలో వరుసగా ముడోసారి అధికారంలోకి వచ్చి బీజేపీ రికార్డు సృష్టించింది. ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఈ సీఎంలను మార్చిన వ్యూహం కూడా ఉపయోగపడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు