జుబీన్ గార్గ్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

ప్రముఖ అస్సామీ గాయకుడు, సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్ అకాల మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ గార్గ్ మృతి చెందినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ ఘటనలో ఏదో కుట్ర ఉందని అభిమానులు, పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

New Update
Zubeen Garg

ప్రముఖ అస్సామీ గాయకుడు, సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్ అకాల మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ గార్గ్ మృతి చెందినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ ఘటనలో ఏదో కుట్ర ఉందని అభిమానులు, పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గార్గ్ భౌతికకాయానికి గువహతిలో మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. సింగపూర్‌లో జరిపిన పోస్టుమార్టం నివేదికను ఇంకా తమకు అందలేదని, కానీ ప్రజాభిప్రాయం, అభిమానుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పోస్టుమార్టం గువహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో (GMCH) రేపు ఉదయం నిర్వహిస్తారని, ఈ ప్రక్రియలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కూడా పర్యవేక్షించనున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

జుబీన్ గార్గ్ భార్య గరిమా సైకియా గార్గ్ కూడా ఈ రెండవ పోస్టుమార్టంకు అంగీకరించినట్లు శర్మ పేర్కొన్నారు. సింగపూర్‌లో ఆయన మృతి చెందిన వెంటనే, అభిమానులు పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల్లో ఈవెంట్ ఆర్గనైజర్, జుబీన్ గార్గ్ మేనేజర్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులను రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ (CID)కు అప్పగించినట్లు సీఎం తెలిపారు.

గార్గ్ మృతికి "డ్రౌనింగ్" (నీట మునగడం) కారణమని సింగపూర్ ప్రభుత్వం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రంలో పేర్కొన్నప్పటికీ, దానిపై స్పష్టత లేదని, అందుకే రెండవ పోస్టుమార్టం తప్పనిసరి అని అస్సాం ప్రభుత్వం భావించింది. దీని వల్ల మరణానికి గల అసలు కారణం స్పష్టంగా తెలుస్తుందని అధికారులు తెలిపారు.

జుబీన్ గార్గ్ మరణం అస్సాం రాష్ట్రానికి ఒక తీరని లోటని, ఆయనకు నివాళిగా రాష్ట్రంలో సెప్టెంబర్ 23న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు