చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. అలాగే బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం, జస్టిస్ వీ లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.
Also Read: చెన్నై గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు !
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారిణులతో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే బాధిత విద్యార్థిపై చదువు ప్రభావితం కాకుండా చూడాలని చెప్పింది. అన్నా వర్సిటీ కూడా ఆమె నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇదిలాఉండగా ఈ నెల 23న చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు.. ఆ అమ్మాయి స్నేహితుడిని గాయపర్చారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.
Also Read: మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు..
అనంతరం ఆ యువతిని అసభ్యకరంగా ఫొటోలు తీసి.. తమపై ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ బాధితురాలు ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని చెన్నై కోట్టూరుపురానికి చెందిన జ్ఞానశేఖరన్‌గా గుర్తించారు. జ్ఞానశేఖరన్ రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునేవాడని సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.