BJP: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకే.. రేసులో ముగ్గురు

తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ హైకమాండ్‌ జాతీయ అధ్యక్ష పదవిని మహిళా నేతకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
BJP may get first woman president

BJP may get first woman president

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. ఎప్పుడెప్పుడు జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారా అనేదానిపై పార్టీ కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ హైకమాండ్‌ జాతీయ అధ్యక్ష పదవిని మహిళా నేతకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం పెంచుకునేందుకు ఇక్కడి మహిళా నేతనే ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. 2023 జనవరి నాటికే జేపీ నడ్డా పదవీ కాలం ముగిసింది. 2024లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఆయన పదవీ కాలం 2024 జూన్ వరకు పొడిగించారు. ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు.   

త్వరలోనే జాతీయ అధ్యక్ష పదవిని కొత్తవారికి అప్పగించనున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మహిళా కీలక నేతలైన నిర్మలా సీతారామన్, పురుందేశ్వరి, వనతి శ్రీనివాసన్‌ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నిర్మల సీతారామన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనరల్ సెక్రటరీ బీఎల్‌ సంతోష్‌తో సమావేశం నిర్వహించారు. అయితే అధ్యక్ష పదవి రేసులో నిర్మల సీతారామన్ ముందున్నట్లు సమాచారం.  

నిర్మలా సీతారామన్‌కే ఛాన్స్ ?

ఒకవేళ ఆమె జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికైతే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ లోక్‌సభలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకే మహిళా నేతకు ఈ పదవి అప్పగిస్తే బీజేపీకి ప్రజల నుంచి మరింత సానుకూలత వచ్చే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. నిర్మలా సీతారామన్ గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్థికశాఖ మంత్రిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కూడా ఆమెకు బలమైన మద్దతు ఉంది. అందుకే అధ్యక్ష పదవి నిర్మలా సీతారామన్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

పురుందేశ్వరి

బీజేపీ మాజీ ఏపీ అధ్యక్షురాలు పురుందేశ్వరి పేరు కూడా జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఈమెకు కూడా సీనియర్ రాజకీయ మహిళా నేతగా మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌ ప్రతనిధి బృందానికి కూడా ఆమె సెలెక్ట్ అయ్యారు. ఏపీలోని బీజేపీ పార్టీలో కీలక నేతగా ఆమె ఉన్నారు. దీంతో ఈమెను కూడా అధ్యక్ష పదవికి పరిశీలినలో తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వనతి శ్రీనివాసన్

వనతి శ్రీనివాసన్‌ తమిళనాడు చెందిన మహిళా నేత. గతంలో ఈమె న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె కోయంబత్తూర్ సౌత్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993లో బీజేపీలో చేరిన ఆమె గతంలో బీజేపీ తమిళనాడు సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. సీనియర్ మహిళా నేతగా ఈమె కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఈమె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

RSS ఓకే 

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళా నేతకు అప్పగించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS) కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ నుంచి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ మహిళా నేతకు జాతీయ అధ్యక్ష పదవిని అప్పగించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ మహిళా నేతకు ఈ పదవి అప్పగిస్తే.. ఆ పార్టీ చరిత్రలో మొదటిసారిగా ఆ అత్యున్నత పదవి పొందిన నేతగా వారు నిలవనున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు