Bangladesh: 54ఏళ్ల ఇండియా-బంగ్లాదేశ్ ప్రయాణం.. దోస్తానా? దుష్మనా?

1971 యుద్ధంలో ఇండియా ఆర్మీని, దౌత్య శక్తిని ధారపోసి పురుడు పోసిన దేశం బంగ్లాదేశ్. అప్పటి నుండి దశాబ్దాల పాటు భారత్ ఆ దేశాన్ని ఓ తమ్ముడిలా ఆదరిస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో అండగా నిలిచింది. 54ఏళ్ల తర్వాత నేడు మారిన పరిస్థితుల కారణంగా ఆ బంధం మసకబారుతోంది.

New Update
India and bangaldesh

ఇండియా తన ఆర్మీని, దౌత్య శక్తిని ధారపోసి పురుడు పోసిన దేశం బంగ్లాదేశ్. 1971 యుద్ధంలో భారత్ అందించిన సహకారంతోనే బంగ్లాదేశ్ పాక్ చెర నుంచి విముక్తి పొందింది. అప్పటి నుండి దశాబ్దాల పాటు భారత్ ఆ దేశాన్ని ఓ 'చిన్న తమ్ముడిలా' ఆదరిస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో అండగా నిలిచింది. అయితే, 54ఏళ్ల తర్వాత నేడు మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ బంధం మసకబారుతోంది. కొన్ని అసాంఘీక శక్తులు బంగ్లాదేశ్‌లో చెలరేగిన అశాంతిని భారత్‌పైకి తిప్పుతున్నారు. 

అల్లర్లు.. అశాంతి 

షేక్ హసీనా ప్రభుత్వం పతనమవ్వడంలో కీలక పాత్ర పోషించిన 'ఇంకిలాబ్ మోంచో' ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. డిసెంబరు 12న గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో గాయపడిన ఆయన, చికిత్స పొందుతూ డిసెంబరు 18న మరణించారు. ఈ వార్త తెలియగానే ఆయన మద్దతుదారులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి హింసాత్మక నిరసనలు చేపట్టారు. అల్లర్ల సాకుతో రాడికల్ శక్తులు మళ్ళీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నాయి. మైమెన్‌సింగ్ జిల్లాలో దీపూ చంద్రదాస్ అనే 30 ఏళ్ల హిందూ యువకుడిని 'దైవ దూషణ' చేశాడనే తప్పుడు ఆరోపణతో అల్లరి మూకలు అత్యంత క్రూరంగా కొట్టి చంపాయి. అనంతరం అతడి మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పంటించిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. విచారణలో ఆ యువకుడు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, సహోద్యోగుల కక్ష వల్లే ఈ దాడి జరిగిందని అధికారులు గుర్తించారు. ఢాకాలోని ప్రముఖ వార్తాపత్రికలు 'ప్రొథోమ్ అలో', 'డెయిలీ స్టార్' కార్యాలయాలకు నిప్పు పెట్టారు. భవనాల్లో మంటలు చెలరేగడంతో పలువురు జర్నలిస్టులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు. చటోగ్రామ్‌లోని అసిస్టెంట్ ఇండియన్ హైకమిషనర్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు.

'చిన్న తమ్ముడు' నుండి వ్యూహాత్మక భాగస్వామి వరకు

గత దశాబ్ద కాలంగా షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లా సంబంధాలు "స్వర్ణ యుగం"గా వర్ణించబడ్డాయి. కనెక్టివిటీ, వాణిజ్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇరు దేశాలు అద్భుతంగా సహకరించుకున్నాయి. భారత్ బంగ్లాదేశ్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. కానీ, 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోయి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.

ఫ్రాంకెన్‌స్టైన్ మాన్స్టర్? - పెరుగుతున్న ఆందోళనలు

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు భారత్‌కు సవాల్‌గా మారుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు దీన్ని 'ఫ్రాంకెన్‌స్టైన్ మాన్స్టర్' అనే కోణంలో చూస్తున్నారు. అంటే తాము సృష్టించిన శక్తే తమకు ముప్పుగా మారడం. దీనికి గల కారణాలు..

తీవ్రవాద శక్తుల పెరుగుదల: హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అక్కడ తీవ్రవాద గ్రూపులు, భారత వ్యతిరేక శక్తులు బలం పుంజుకుంటున్నాయి.
మైనార్టీలపై దాడులు: బంగ్లాలోని హిందూ మైనార్టీలపై జరుగుతున్న హింస ఢిల్లీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఈశాన్య రాష్ట్రాలకు ముప్పు: ఇటీవల కొందరు బంగ్లా నాయకులు భారత్ లోని 'సెవెన్ సిస్టర్స్' (ఈశాన్య రాష్ట్రాల) వేర్పాటువాదులకు ఆశ్రయం ఇస్తామని హెచ్చరించడం దౌత్యపరంగా పెద్ద దుమారం రేపింది.

స్నేహానికి పరీక్ష.. 

54 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇప్పించిన భారత్, నేడు తన పొరుగు దేశంలో పెరుగుతున్న అస్థిరతను చూసి అప్రమత్తమవుతోంది. బంగ్లాదేశ్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే, భారత్ వంటి మిత్రదేశంతో ఉన్న చారిత్రక బంధాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రష్యా వంటి దేశాలు కూడా భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని సూచిస్తుండటం ఈ సమస్య తీవ్రతను సూచిస్తోంది. బంగ్లాదేశ్‌లో 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ వాతావరణం భారత్ పట్ల మరింత కఠినంగా మారుతోంది. 

ఫ్రాంకెన్‌స్టైన్ మాన్స్టర్ అని ఎందుకు అంటున్నారు?
మేరీ షెల్లీ రాసిన ప్రసిద్ధ నవలలో డాక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తన మేధస్సుతో ఒక జీవిని సృష్టిస్తాడు. కానీ చివరికి ఆ జీవే దాన్ని తయారు చేసిన వాడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం భారత్, బంగ్లా రిలేషన్‌లో నిపుణులు ఈ పోలికను వాడుతున్నారు..

మతోన్మాదం: బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక శక్తులు, ముఖ్యంగా జమాత్-ఎ-ఇస్లామీ వంటి గ్రూపులు బలం పుంజుకుంటున్నాయి.
మౌలిక సదుపాయాల వినియోగం: భారత్ అందించిన ఆర్థిక సహాయం, కనెక్టివిటీ ప్రాజెక్టులను వాడుకుంటూనే, అక్కడ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది.
భద్రతా పరమైన ముప్పు: ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద గ్రూపులకు బంగ్లాదేశ్ గడ్డ మళ్లీ వేదికగా మారుతుందేమోనన్న భయం భారత్‌లో నెలకొంది.

Advertisment
తాజా కథనాలు