కర్ణాటకలో ప్రస్తుతం ముడా స్కామ్ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో అంశం వివాదస్పదమవుతోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం.. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష రావడం తప్పనిసరి చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని విపక్ష పార్టీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది సామాజిక సామరస్యానికి ఆటంకం కలిగిస్తుందని ఆరోపిస్తోంది.
ఉర్దు రావాల్సిందే
ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ముదిగెరె, చిక్కమగళూరు అనే రెండు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ముస్లిం జనాభా 31.94 శాతంగా ఉంది. అయితే ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ల పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష తప్పనిసరిగా తెలియాలని ఉద్యోగ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిర్ణయంపై రాష్ట్రంలో వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర భాషా సమైక్యతను దెబ్బతీయాలని చూస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజీపీ మాజీ ఎంపీ నలిన్ కుమార్‌తో సహా మరికొందరు పార్టీ నేతలు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. ఉర్దు తప్పనిసరి చేయడం వల్ల కన్నడ మాట్లాడేవాళ్లు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Also Read: శంషాబాద్ నుంచి అయోధ్య రామ జన్మభూమికి విమాన సర్వీసులు
కన్నడను దెబ్బతీసే ప్రయత్నం
ఇదిలాఉండగా.. కర్ణాటక రాజకీయాల్లో భాషారమైన సమస్య చాలాకాలంగా సున్నితమైన అంశంగా ఉంది. గతంలో హింది భాషను కూడా విధించాలని ప్రయత్నించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు రెండు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల కోసం ఉర్దు భాషను కూడా తప్పనిసరి చేయడంపై కూడా వివాదం చెలరేగుతోంది. ఈ నిర్ణయం రాష్ట్ర అధికార భాష అయిన కన్నడను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కన్నడ కన్నా ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటనే విమర్శలు సైతం వస్తున్నాయి.
కర్ణాటకలో వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఉద్యోగాల కోసం వస్తుంటారు. ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరాల్లో ఇది అధికంగా ఉంటుంది. ఇక్కడ వచ్చే వలసదారుల్లో చాలామంది హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ మాట్లాడేవారు ఉన్నారు. హిందీ భాషను విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు పలు ప్రాంతాల్లో ఉర్దూ భాషకు ప్రాధాన్యమివ్వడం మరింత సమస్యాత్మకంగా మారింది. అంగాన్‌వాడీ టీచర్లు.. ప్రభుత్వ పతకాలు, ప్రజల మధ్య వారధిగా పనిచేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కర్ణాటకలో కన్నడ మాట్లాడే ప్రజలే ఎక్కువగా ఉంటారు. అయితే ఉర్దు భాషను తప్పనిసరి చేయడం వల్ల అంగాన్‌వడి వర్కర్లు, ప్రజల మధ్య సంబంధం తొలగించినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు.
భవిష్యత్తులో ప్రమాదం
ఉర్దూ భాష రానివాళ్లు కూడా ఆయా ప్రాంతాల్లో ఉంటారని.. దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మైనార్టీ ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇది భాషా పరమైన వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. కన్నడ భాషకు తొలిప్రాధాన్యం ఇవ్వాలని.. కనీసం ఉర్దూకి సమానంగా పరిగణించాలని చెబుతున్నారు. దీనివల్ల అంగన్‌వాడీ టీచర్లు మైనార్టీ ప్రజలకు సేవలందిస్తూనే.. స్థానిక భాషను కొనసాగిస్తారని అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం కేవలం భాషాపరమైన విభజన మాత్రమే కాకుండా.. భవిష్యత్తు విధానాలను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అయోధ్యకు తిరుమల లడ్డూ ఎఫెక్ట్... కొత్తగా ప్రసాదం ఇలా!