Nara Lokesh: మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: నారా లోకేష్

వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ చంద్రబాబును ప్రజల మధ్యకు రానివ్వకుండా చేస్తున్నారని టీడీపీ నేత లోకేష్ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని విమర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపెట్టలేకపోయారని.. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలంటూ సవాల్ చేశారు.

New Update
AP News: ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో మరోసారి ములాఖత్ అనంతరం ఆ పార్టీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ తప్ప చేయకపోయినా కూడా 50 రోజులుగా బంధించారని అన్నారు. ఇప్పటివరకు వైసీపీ సర్కార్ స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో.. తమ పార్టీకి డబ్బు అందాయనే ఆధారాలు చూపించలేదని ఆరోపించారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండని సవాల్ విసిరారు.  రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేవలం వ్యక్తిగత కక్షసాధింపుతోనే చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా జైల్లో పెట్టారని మండిపడ్డారు. అలాగే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబును చంపేయడం కోసం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ మహిళా మంత్రి అంటున్నారన్నారు.

చంద్రబాబును అరెస్టు చేసిన 50 రోజుల్లో ఏం పీకారని.. కొత్త ఆధారాలు ఏమైనా ప్రజల ముందు పెట్టారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఒక్క సెంటర్ కూడా మూయలేదని స్కిల్ డెవలాప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి చెప్పారన్నారు. మాకు సంబంధించిన ఆస్తులు, అకౌంట్స్‌ను కూడా ప్రజల ముందు పెట్టామని తెలిపారు.
చంద్రబాబును అరెస్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. ఏపీలో 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. సీఎం జగన్ దీనిపై సమీక్ష చేయకుండా అసలు రైతులనే పట్టించుకోకుండా బస్సు యాత్ర పేరుతో గాలియాత్ర చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరుగుదలపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని.. బస్సును ఆపి డ్రైవర్‌పై దాడి చేశారని.. ఈ వీడియో కూడా వైరలైందని లోకేష్ అన్నారు. దాడి చేసిన డ్రైవర్‌పై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. కానీ టీడీపీ నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పెట్టి పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. సైకో జగన్‌ను వదిలిపెట్టమని.. ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అసలు వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతే బెయిల్‌పై జగన్ పదేళ్లు ఎలా బయట ఉన్నారని.. సొంత బాబాయ్‌నే చంపిన అవినాశ్ బయట ఎలా తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. వైద్యారోగ్య పరీక్షల పేరుతో ఏం చేస్తారోనని భయంగా ఉందని చంద్రబాబు ఆరోగ్యం పట్ల లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలు పరిసరాల్లో డ్రోన్లు ఎగురుతున్నాయని.. చంద్రబాబు లోపలికి వెళ్లే దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు బరువు తగ్గిన మాట వాస్తవమని తెలిపారు.

72 కిలోలు ఉన్న చంద్రబాబు 66 కిలోలకి తగ్గితే ప్రభుత్వం ఒక కిలో మాత్రమే తగ్గారని చెబుతోందని ఆరోపించారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై పాదయాత్రలో ఈడీకీ, ఐటీకి లేఖ రాస్తానని అన్నారు. ఇసుకపై సీబీఐకీ.. అలాగే మైనింగ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. న్యాయస్థానాల ద్వారా తాము పోరాటం కొనసాగిస్తున్నామన్న లోకేష్.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

Advertisment
తాజా కథనాలు