/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/bhuvaneswari-nara.jpg)
Nara Bhuvaneshwari v/s Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. చంద్రబాబును మరోసారి గెలిపించినందుకు అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె కుప్పానికి వెళ్లారు. నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించనున్నట్లు సమాచారం.
మరోవైపు గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అత్యధిక మెజారిటీని ఇచ్చే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని నారా భువనేశ్వరి అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారమే గుడుపల్లి మండలం కమ్మగట్టుపల్లిని ఆమె దత్తత తీసుకుంటున్నట్లు నారా భువనేశ్వరి మంగళవారం ప్రకటించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ (Andhra Pradesh) లో జరిగిన అకృత్యాలకు, దౌర్జన్యాలను చూసి మహిళలు కసితో ఓటేసి టీడీపీ (TDP) ని గెలిపించుకున్నారని ఆమె వివరించారు. అలాంటి మహిళల రుణం తీర్చుకోలేమన్న భువనేశ్వరి.. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.
కుప్పంలోని నిరుద్యోగ యువత ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా.. కుప్పంలోనే పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె అక్కడి ప్రజలకు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బిడ్డలాంటి వారేనన్న నారా భువనేశ్వరి.. వారి ఎదుగుదల కోసం ఎంతవరకైనా పోరాడతానని అన్నారు.
అలాగే కుప్పం నియోజకవర్గంలో తాను దత్తత తీసుకున్న రెండు ఊర్లతో పాటుగా అన్ని గ్రామాల అభివృద్దికి కృషి చేస్తామని ఆమె వివరించారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.