Nagpur Woman Supari : ఆమె చేసేది మంచి ప్రభుత్వ ఉద్యోగం (Government Job).. జీతం కూడా లక్షల్లోనే. కానీ డబ్బు మీద ఆశ చాలలేదు. దీంతో మామ ఆస్తి మీద కన్ను పడింది. సమాజంలో మామకు మంచి పేరు, మర్యాదలు, గౌరవం ఉన్నాయి. మంచి ఆరోగ్యంగాను ఉన్నారు. దీంతో ఆస్తి దక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది.
అందుకే మామను ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్లాన్ వేసింది. కారు తో గుద్ది చంపాలని నిందితులకు కోటి రూపాయల సుఫారీ కూడా ఇచ్చింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నాగపూర్ (Nagpur) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అర్చన మనీశ్ పుట్టెవార్ (Manish Puttewar) (53) ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఆమె భర్త మనీశ్ వైద్యుడు. ఇటీవల అర్చనకు మామ పురుషోత్తం పుట్టెవార్ (Purushottam Puttewar) (82) ఆస్తిపై కన్ను పడింది. అత్త శకుంతల అనారోగ్యంతో ఉండటంతో.. మామను అడ్డు తొలిగించుకుంటే రూ.300 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి మొత్తం తన సొంతం అవుతుందని ప్లాన్ వేసింది. దీంతో మామ హత్యకు కుట్ర పన్నింది. తన భర్త వద్ద డ్రైవర్‌గా పని చేసే బగ్డే, అతడి స్నేహితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌కు మామను చంపే పనిని ఇచ్చింది.
దాదాపు 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటకు వస్తుండగా బగ్డే, అతడి మిత్రులు కారుతో వేగంగా ఢీ కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో పురుషోత్తం ప్రాణాలు కోల్పోయారు. అయితే పోలీసులు ముందు నుంచి కూడా ఈ ప్రమాదం మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోతుగా విచారణ జరపగా అర్చన పన్నిన కుట్ర బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు హత్యకు పాల్పడ్డ మరో ముగ్గురిని అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు. నిందితురాలు టౌన్‌ప్లానింగ్ శాఖలో కూడా ఆమె అవినీతి చరిత్ర బాగానే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా బయటకు తీసేందుకు వారు రంగం సిద్దం చేస్తున్నారు.
Also read: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్!