MLA Roja Nomination : నగరి నియోజకవర్గం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రోజా(Roja). గత ఎన్నికల్లో కూడా ఈమె ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం జగన్ నాయకత్వంలో టూరిజం మంత్రిగా ఉన్న రోజా మళ్ళీ నగరి నుంచే పోటీలోకి దిగుతున్నారు. నిన్న నగరి(Nagari) లోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి..అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. ఈసందర్భంగా రోజా నామినేషన్‌తో పాటూ తన ఆస్తుల, అప్పుల అఫిడవిట్‌ను కూడా సమర్పించారు.
ఈ వివరాల ప్రకారం.. 2019లో రోజా చరాస్తుల విలువ రూ.2.75 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.4.58 కోట్లు ఉన్నాయి. అలాగే 2019లో స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.6.05 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2019లో ఆరు కార్లు, ఓ బైక్ ఉందని చెబితే ఇప్పుడు 9 కార్లు ఉన్నాయని రోజా ఆఫిడవిట్‌లో రాశారు. వీటితో పాటూ రోజా దగ్గర రూ.50,229 క్యాష్, భర్త దగ్గర రూ.5 వేలు ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే మిగతా ఆస్తుల వివరాల కొస్తే భర్త పేరిట 6.39 ఎకరాల భూమి, మార్గదర్శి చిట్‌ఫండ్స్(Margadarshi Chit Funds) లో రూ.39.21 లక్షల విలువైన చీటీ , మరో ప్రైవేట్ చిట్‌లోనూ రూ.33 లక్షలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా కుటుంబానికి రూ.10.63 కోట్ల ఆస్తులు ఉన్నాయని రోజా అఫడవిట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు తన కష్టాన్ని గుర్తించిన జగనన్న(YS Jagan) తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు. తన సేవలకు గుర్తుగా మంత్రి పదవి ఇచ్చారన్నారు. మూడోసారి తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేశారని.. అయితే జగన్ అండతో తాను నేడు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. అలాగే నగరి ప్రజలు కూడా తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు రోజా. ఈసారి కూడా తప్పకుండా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని జగనన్నకు కానుకగా ఇస్తానని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు నగరి ప్రజలకు అండగా ఉంటానని ప్రమాణం చేశారు రోజా.