Vasantha Krishna Prasad: సొంత పార్టీ ఎమ్మెల్యేనే వైసీపీ (YCP) ప్రభుత్వం పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలం నుంచి పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం నాడు వెలగలేరులోని ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ మీదే విమర్శలు కురిపించారు. సంక్షేమంతో పోల్చుకుంటే..అభివృద్ధిలో ముందుకు సాగలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక సొంత పార్టీ ప్రజా ప్రతినిధులే ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.
నేను ఆర్చలేక, తీర్చలేక...
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఉందని తెలిపారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలా మంది వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బిల్లుల కోసం చాలా మంది కాంట్రాక్టర్లు, వైసీపీ నేతలు రోజంతా నా కార్యాలయం చుట్టు తిరుగుతున్నారని తెలిపారు. 20వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆ స్థలాలకు అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగ్ చేసిన ఏ కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయి డబ్బు రాలేదుకాంట్రాక్టర్లంతా రోజూ నా ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇప్పుడు నిధులు తెచ్చినా చేసే వాళ్ళు లేరు,చేసినా వాళ్ళను నేను ఆర్చలేక, తీర్చలేక పోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాత ఇచ్చిన మామిడి తోట కూడా...
అధికారంలోకి వచ్చిన మొదటి మూడు సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, వాటికి సంబంధించిన బిల్లులు ఏవీ రాక గడిచిన ఏడాదిన్నరగా మేము ఎలాంటి నిధులు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేయట్లేదని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. 10సంవత్సరాలు ప్రాణం పెట్టి పని చేసిన వైసీపీ కార్యకర్తకి 7కోట్ల డ్రైన్లు,రోడ్లు కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తే అప్పులపాలై వాళ్ళ తాత ఇచ్చిన మామిడి తోట కూడా అమ్ముకున్నాడు
దీనికి తగినట్లు తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని వసంత అన్న మాటలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం నుంచి ఆయనకు జోగి రమేశ్‌కు విభేధాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
పైన డబ్బులు లేకుండా నేను ఎన్ని రోజులు పని చేసేది?మానసికంగా ఇదంతా కష్టంగా ఉందిఎప్పుడు తెల్దారుతుందా,ఎప్పుడు చీకటి పడుతుందా అని రోజూ ఎదురు చూడడమే శాసనసభ్యుల పని అంటూ వసంత విచారం వ్యక్తం చేశారు. చాలా కాలం నుంచి వసంత పార్టీని వీడి మరో పార్టీకి వెళ్తున్నారనే ప్రచారానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ఊతమిచ్చేలా ఉన్నాయి.
Also read: అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్ షా!