మరో వారం రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార, విపక్ష నేతలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి ముస్లీం మైనారిటీల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన ముస్లీం సోదరులకు ధన్యవాదాలు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ సూళ్లను ఏర్పాటు చేసిందని.. అలాగే షాదీ ముబారక్ పథకాన్ని కూడా అమలు చేస్తోందని అన్నారు. సదాశివపేటలో కబరిస్తాన్ కోసం 5 ఎకరాల వరకు ఇచ్చామని తెలిపారు. అలాగే మైనార్టీ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని.. 17 వేల మంది ఇమామ్‌లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు.
Also read: రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..!
గతంలో చింతా ప్రభాకర్ ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అని అంటున్నారని.. కానీ ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవరని హరీష్ రావు అన్నారు. ఇక జానారెడ్డి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయ్యట్లేదు కానీ.. సీఎం అవుతా అని అంటున్నారని.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అలాగే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజ్,నర్సింగ్ కాలేజ్ ఇచ్చారని తెలిపారు. అలాగే రూ.2 కోట్లతో.. సంగారెడ్డి, సదాశివపేటలో మైనార్టీలకు షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ.. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు న్యాయం: మాయావతి