అభివృద్ధి పేరుతో కేసీఆర్ దోపిడీకి తెరలేపారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వ మాస్టర్ ప్లాన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పేదల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల భూములు ఏ విధంగా లాక్కోవాలని అలోచించిన కేసీఆర్ నిర్మల్‌లో కొత్త మాస్టర్ ప్లాన్ అంటూ భూములను లాక్కుంటున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ మాస్టర్ ప్లాన్‌ను వెంటనే రద్దు చేసి జీవో నెంబర్ 220ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న ఈటల రాజేందర్.. వ్యవసాయం వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న అన్నదాతల భూములను లాక్కుంటే తర్వాత వారు ఎలా బ్రతుకుతారనేది ప్రభుత్వం పట్టించుకోదా అని ఆయన ప్రశ్నించారు. రైతుల కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఈటల వెల్లడించారు.
నిర్మల్‌లో రింగ్ రోడ్డు ఎటువైపు వస్తుందో తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రైతుల భూమిని తక్కువ ధరకు కొంటున్నారని, భూమి అమ్మని రైతులను బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆ భూమిని ప్రభుత్వానికి అధిక ధరకు అమ్ముకుంటూ బీఆర్‌ఎస్ నాయకులు పబ్బం గడుపుతున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కొత్త రూపం ఎత్తారన్న ఈటల.. సీఎం భూముల బ్రోకర్‌లా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.