Manik Rao Thackeray: హామీలపై గ్యారెంటీ కార్డు ఇస్తాం

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. కేసీఆర్‌ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు

New Update
Manik Rao Thackeray: హామీలపై గ్యారెంటీ కార్డు ఇస్తాం

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో వేగం పెంచింది. గాంధీ భవన్‌ మీడియాతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే వీలైనంత త్వరలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న హామీలపై గ్యారెంటీ కార్డు సైతం అందించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్డును ఇంటింటికీ తిరిగి అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలను నిలబెట్టాలని చూస్తున్నామన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల పోత్తులపై స్పందించిన ఠాక్రే పొత్తులపై అనాధికారిక చర్చలు జరుగుతున్నాయన్నారు. వామపక్షాలతో చర్చలు ఇంకా ప్రథమిక దశలోనే ఉన్నాయన్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో వైఎస్‌ షర్మిల చేరికకు సంబంధించిన అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన వెల్లడించారు.

మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఠాక్రే రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అవినీతికి అవధులు లేకుండా పోయాయన్నారు. కేసీఆర్‌ ప్రజలను పీక్కుతుంటున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి నియంత పాలన గురించి, ఆయన అవినీతి గురించి తాము ప్రజలకు వివరిస్తామన్నారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలని ఠాక్రే పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ డబ్బులు ఇస్తున్నాడని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన.. కేసీఆర్‌ ఇచ్చే డబ్బులకు ఆశపడే వారు తమ పార్టీలో లేరన్నారు. ఒకవేళ ఆలాంటి వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తే తాము అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.

కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని మాణిక్‌ రావు ఠాక్రే అన్నారు. కాంగ్రెస్‌ గ్రాఫ్ అమాంతం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్రతో కాంగ్రెస్‌ గెలుపు అంచులకు వెళ్లినట్లు అయిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కేసీఆర్‌ అవినీతి, అక్రమాలను బయటపెట్టి ఆయన కుటుంబాన్ని జైలుకు పంపడం కూడా ఖాయమని మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు